
మంచి ఉద్యోగం, ఐదెంకల జీతం అని నమ్మించి లక్షలకు లక్షలు కట్నం తీసుకొని మరీ పెళ్లి చేశారు. ఆ కట్నం చాలలేదని అదనపు కట్నం కోసం మళ్లీ వేధించారు. చివరకు వారి వేధింపులు చాలలేక వివాహిత అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కాకినాడలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాజానగరం మండలం దివాన్‌చెరువుకు చెందిన మండాల రమ్యశ్రీ(23)కి కాకినాడకు చెందిన వెంకట్‌తో 2018 ఆగస్టు 19న వివాహమైంది. ఆ సమయంలో వెంకట్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అని, ఐదంకెల జీతం అని చెప్పి నమ్మించారు. కట్నం కింద రూ.30లక్షలు నగదు ఇచ్చారు. అయితే.. పెళ్లి తర్వాత కొద్దికాలానికే అదనపు కట్నం కావాలంటూ వేధింపులు మొదలయ్యాయి.
రమ్యశ్రీ 2019 నవంబర్‌లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంతకుముందే ఆచారం ప్రకారం పుట్టింటివారు తీసుకువెళ్లారు. ఇదే అదునుగా భావించిన వెంకట్ కుటుంబ సభ్యులు రమ్యశ్రీని 11 నెలల వరకు ఇంటికి తీసుకురాలేదు. అదనపు కట్నంతోనే అడుగుపెట్టాలంటూ వేధించేవారు. ఈ నేపథ్యంలో కొందరు పెద్దలు మధ్య వర్తిత్వంతో తాత్కాలికంగా సద్దుమణిగింది.
తర్వాత బిడ్డతో సహా రమ్యశ్రీ మళ్లీ అత్తారింట్లో అడుగుపెట్టింది. అప్పుడు మళ్లీ వేధింపులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో రమ్యశ్రీ ఆత్మహత్యకు పాల్పడిందని భర్త, ఆ ఇంటి పైపోర్షన్‌లో ఉంటున్న చిన్నత్తయ్య, చినమామయ్య సంధ్యారాణి, విక్రమ్‌శ్రీనివాస్ మృతురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చనిపోయిందని చెప్పారు. వారే త్రీటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆగమేఘాల మీద చేరుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తమ కుమార్తెను కొట్టిచంపారని కటుంబ సభ్యులు ఆరోపించారు. ఉరి వేసుకున్నట్టు చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తె మరణంపై నిజానిజాలు తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ హత్య చేసింది భర్త, అత్త, మామలేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.