
కేంద్రప్రభుత్వం ఏపికి అన్యాయం చేస్తూనే ఉంది. విభజన చట్టంలో కీలకమైన అంశాలను అమలు చేయకుండా ఇంతకాలం అన్యాయం చేసింది. తాజాగా రాష్ట్రానికి మంజూరైన ప్రతిష్టాత్మక సంస్ధను కూడా తన్నుకుపోతోంది. రాష్ట్రానికి మంజూరైన మెరైన్ అకాడమి కూడా రాష్ట్రం నుండి గుజరాత్ కు తరలిపోయినట్లు సమాచారం. తీరప్రాంతాల్లో విధులు నిర్వహించే గస్తీ దళాలకు శిక్షణ ఇవ్వటం మెరైన అకాడమి విధుల్లో ఒకటి. విశాలమైన తీరప్రాంతం కలిగిన దక్షిణ భారత దేశంలో మెరైన్ అకాడమి లేదన్న విషయం అందరికీ తెలిసిందే. విభజన తర్వాత రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం ఈ అకాడమీని మంజూరు చేసింది.
అసలు, దీనికోసం తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అయితే, అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యానాయడు పట్టుబట్టడంతో కేంద్రం అకాడమీని ఏపికే కేటాయాంచింది. మొత్తం మీద అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం మచిలీపట్నంకు సమీపంలో 300 ఎకరాలను కూడా కేటాయించింది. అకాడమీకి అవసరమైన భవనాలు, అధునాతన పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం తదితరాలను సమకూర్చుకుంటోంది ప్రభుత్వం.
ఇంతలో అకాడమీని ఏపి నుండి తరలించాలని కేంద్రం భావిస్తున్నట్లు మొదట చల్లగా ఓ కబురందింది. దాంతో ప్రభుత్వం ఎక్కడి పనులను అక్కడే ఆపేసింది. వెంటనే తనకు అందిన కబురు విషయమై వాకాబు చేసింది. కొంతకాలలం పాటు ఎవ్వరూ ఏమీ స్పష్టంగా చెప్పలేదు. తర్వాతెప్పుడో అది ఉత్త కబురు కాదని నిజమన్న సంకేతాలు కేంద్రం నుండి అందాయి. వెంటనే అకాడమీని కేంద్రం గుజరాత్ కు తరలిస్తున్నట్లు అధికారికంగా సమాచారం కూడా అందింది. అంత హడావుడిగా గుజరాత్ కు ఎందుకు తరలిస్తున్నట్లు?
ఎందుకంటే, అక్కడ ఈ ఏడాది చివరిలో ఎన్నికలున్నాయి. ఏపి నుండే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు కేటాయించిన సంస్ధలను కూడా కేంద్రం గుజరాత్ కు తరలిస్తోందట. ఎందుకంటే, మళ్ళీ ఎన్నికల్లో గెలుపు కోసం. అసలే, అక్కడ పరిస్ధితులు భారతీయ జనతా పార్టీకి బావోలేవట. దానికి తోడు పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ తదితరాల వల్ల ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రభ మసకబారిపోయింది. దానికితోడు పటేళ్ళ రిజర్వేషన్ చిచ్చు ఇంకా ఆరలేదట. అందుకనే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు మోడి కృషి చేస్తున్నారని చెప్పుకునేందుకు ఇతర రాష్ట్రాలకు కేటాయించిన ప్రతిష్టాత్మక సంస్ధలను కూడా గుజరాత్ కు తన్నుకుపోతున్నారట.