టీడీపీ కార్యాలయంపై దాడి: నోటీసులను గోడకు అతికించిన పోలీసులు

By telugu teamFirst Published Oct 23, 2021, 1:40 PM IST
Highlights

మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు రెండు నోటీసులను జారీ చేశారు. దాడికి సంబంధించిన సమాచారం కోసం సీసీటీవీ ఫుటేజీని సమర్పించాలని కోరుతూ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

మంగళగిరి: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మంగళగిరి కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజీని అందించాలని, ఈ సీసీటీవీ ఫుటేజీని ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా అందించాలని ఆదేశిస్తూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. TDP నేత పట్టాభి అభ్యంతరకర వ్యాఖ్యలకు రెచ్చిపోయిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిందే.

ఆ దాడి కేసులో పోలీసులు ఇప్పటికే పది మందిని అరెస్టు చేశారు. మరింత మంది నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని అందించాలని పోలీసులు సూచించారు. బద్రీ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత మంది నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీ అవసరమని పోలీసులు అన్నారు. 

Also Read: అమిత్ షాను ఆ ‘‘ పదం ’’తో పిలవండి.. మేం క్షమాపణలు చెబుతాం: చంద్రబాబుకు సజ్జల సవాల్

టీడీపీ రిసెప్షన్ కమిటీకీ చెందిన కుమారస్వామి అనే వ్యక్తికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. సాయంత్రం 5 గంటలలోగా తమ ముందు హాజరై వివరాలను అందించాలని వారు ఆ నోటీసులో సూచించారు. ఈ నోటీసును కూడా పోలీసులు మంగళగిరి టీడీపీ కార్యాలయం గోడకు అతికించారు. నిందితులను గుర్తించేందుకు నాలుగు పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. 

కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదును ఎందుకు నమోదు చేయలేదని టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. కుమారస్వామి తన ఫిర్యాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్లను కూడా ప్రస్తావించారని, టీడీపీ కార్యాలయంపై దాడికి వారు కుట్ర చేశారని ఆరోపించారని, పోలీసులు దాన్ని పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఈ విషయంపై టీడీపీ కోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఢిల్లీకి చేరిన ఏపీ పంచాయతీ: రాష్ట్రపతి అపాయింట్‌మెంట్.. సోమవారం హస్తినకు చంద్రబాబు

కాగా, టీడీపీ కార్యాలయం ప్రతినిధులు గానీ, కుమారస్వామి గానీ పోలీసుల నోటీసులకు స్పందిస్తారా లేదా అనేది అనుమానంగానే ఉంది. వారు స్పందించకపోతే పోలీసులు మరోసారి నోటీసులు జారీ అవకాశం ఉంది. అప్పటికీ స్పందించకపోతే పోలీసులు కూడా కోర్టుకు ఎక్కవచ్చు. కాగా, కుమారస్వామిని మాత్రం ఆయన ఇంటికి వెళ్లి పోలీసులు విచారించే అవకాశం లేకపోలేదు.   

ఇదిలావుంటే, టీడీపీ నాయకుడు Pattabhi ఇంటిపై దాడి చేసిన కేసులో పటమట పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. రెండు దాడులపై పోలీసులు విడివిడిగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లో ఇప్పటి వరకు 21 మందిని అరెస్టు చేశారు. జగన్ మీద వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. పట్టాభిపై కేసు పెట్టి ఆయనను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను జైలుకు తరలించారు.

click me!