ఆర్ 5 జోన్‌లో పేదలకు ఇళ్లు.. న్యాయస్థానాలు ఆమోదిస్తాయనే నమ్ముతున్నాం : ఆళ్ల రామకృష్ణారెడ్డి

By Siva KodatiFirst Published Jul 22, 2023, 3:56 PM IST
Highlights

అమరావతిలో ఆర్ 5 జోన్‌‌లో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు న్యాయస్థానాలు అనుమతిస్తాయని ఆకాంక్షించారు వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. వచ్చే సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని ఆళ్ల అన్నారు. 

అమరావతిలో ఆర్ 5 జోన్‌ వ్యవహారంపై వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వటాన్ని చంద్రబాబు రియల్ ఎస్టేట్ వర్గం గతంలోనూ వ్యతిరేకించిందన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వడానికి కోర్టులు అనుమతిస్తాయనే నమ్మకం వుందని ఆర్కే ఆకాంక్షించారు.  సీఆర్‌డీఏ చట్టం ప్రకారమే రాజధానిలో 5 శాతం స్థలాన్ని పేదలకు కేటాయించాలని.. కానీ చంద్రబాబు నాయుడు అలా చేయలేదని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. వచ్చే సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని ఆళ్ల అన్నారు. 

మరోవైపు.. ఆర్ 5 జోన్‌ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు శాంక్షన్ పత్రాలను కూడా అందించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఇక, ఆర్‌ 5 జోన్‌‌లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఏపీ కేబినెట్ ఇదివరకే ఆమోదం తెలిపింది. 

Latest Videos

ALso Read: ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి జగన్ సర్కార్ కసరత్తు, హైకోర్టు తీర్పు రిజర్వ్.. అమరావతిలో ఉత్కంఠ..!!

ఇదిలా ఉంటే, ఆర్‌ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని రాజధానికి భూములిచ్చిన రైతులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమరావతిలోని ఆర్‌-5 జోన్‌లో పేదలకు ఇళ్లు నిర్మించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం రిజర్వ్‌లో ఉంచింది. అంతకుముందు అమరావతిలోని ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై పిటిషనర్లు, ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. జులై 24న పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుండగా.. ఈ ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు.. జీవో 45పై హైకోర్టు, సుప్రీం కోర్టు కోర్టు స్టే ఆర్డర్‌ ఇవ్వలేదని.. అందుకే అమరావతిలో ఆర్‌5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరం లేదని భావించినట్టుగా చెప్పారు. అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణంలో ఒక వర్గం ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని వాదనలు వినిపించారు. సీఆర్‌డీఏ నిబంధనల ప్రకారం సేకరించిన మొత్తం భూమిలో ఐదు శాతం పేదల ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలని కోరారు. మాస్టర్‌ప్లాన్‌లో దీని కోసం భూమి కేటాయించకపోవడంతో.. ఎలక్ట్రానిక్ సిటీ అభివృద్ధికి కేటాయించిన భూమిలో కొంత భాగాన్ని ప్రభుత్వం పేదలకు కేటాయించిందని చెప్పారు. 
 

click me!