ఏపీ అసెంబ్లీ ఎన్నికలు : టికెట్ వుందా లేదా.. చంద్రబాబు ఇంటికి సీనియర్ నేతల క్యూ

By Siva Kodati  |  First Published Feb 26, 2024, 6:43 AM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన తొలి జాబితాను ఇరు పార్టీల అధినేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లిస్ట్‌లో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతల పేర్లు మిస్ అయ్యాయి. ఈ క్రమంలోనే సీనియర్ నేతలు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి క్యూ కట్టారు.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన తొలి జాబితాను ఇరు పార్టీల అధినేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లిస్ట్‌లో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతల పేర్లు మిస్ అయ్యాయి. దీంతో నేతలు, వారి అనుచరులు ఉలిక్కిపడ్డారు. తమకు టికెట్ వుంటుందా లేదా అన్న అనుమానాలు వారిని వెంటాయి. ఈ క్రమంలోనే సీనియర్ నేతలు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి క్యూ కట్టారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బొడ్డు వెంకట రమణ, పిల్లా గోవింద్, దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావులు చంద్రబాబును కలిసిన వారిలో వున్నారు.

టికెట్ ఎందుకు ఇవ్వలేకపోతున్న విషయాన్ని వారికి చంద్రబాబు వివరించారు. అలాగే మరికొందరి నియోజకవర్గాలు ఎందుకు మార్చాల్సి వచ్చిందన్నది కూడా చర్చించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాధాన్యత కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తొలి జాబితాలో మాజీ మంత్రి దేవినేని ఉమా పేరు లేకపోవడం తెలుగు తమ్ముళ్లను సైతం ఆశ్చర్యపరిచింది. మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ త్వరలో టీడీపీలో చేరుతారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో ఉమా పేరు లిస్ట్‌లో కనిపించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. మైలవరం లేదా  పెనమలూరు నియోజకవర్గాల్లో ఏదో ఒకటి దేవినేనికి కేటాయిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. 

Latest Videos

మరో సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు పేరు కూడా లిస్ట్‌లో లేకపోవడం కలకలం రేపింది. చంద్రబాబును కలిసిన తర్వాత గంటా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తనను తిట్టారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని శ్రీనివాసరావు హెచ్చరించారు. టీడీపీ జనసేన తొలి జాబితాలో పేరు లేకుంటే సీనియర్లను అవమానించినట్లు కాదని, పొత్తుల కారణంగా టికెట్ దక్కనివారికి పార్టీ న్యాయం చేస్తుందని గంటా తెలిపారు. 

చీపురుపల్లి నుంచి ఈసారి బరిలో దిగాలని చంద్రబాబు తనకు సూచించారని.. అయితే తాను భీమిలి నుంచి పోటీ చేస్తానని చెప్పినట్లు శ్రీనివాసరావు వివరించారు. టీడీపీ తొలి జాబితా ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని.. ప్రజల నుంచి కూడా స్పందన బాగుందని ఆయన వెల్లడించారు. 70 మంది అభ్యర్దుల పేర్లను ప్రకటించడానికి వైసీపీ 7 జాబితాలు విడుదల చేసిందంటూ గంటా చురకలంటించారు. 

కాగా.. గుంటూరు జిల్లాలోని కీలక స్థానాల్లో ఒకటైన తెనాలి పొత్తులో భాగంగా జనసేన కోరడంతో ఈ సెగ్మెంట్‌ను తెలుగుదేశం పార్టీ కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జనసేనతో టీడీపీ పొత్తు ఖరారైనప్పుడే తెనాలి సీటు విషయంలో సర్వత్రా చర్చ జరిగింది. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కోసం తెనాలి సీటును పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అడుగుతారని భావించారు.

అనుకున్నట్లుగానే తెనాలి నియోజకవర్గం నుంచి నాదెండ్ల అభ్యర్ధిత్వం ఖరారైంది. మరి ఆలపాటి పరిస్ధితి ఏంటన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రాజేంద్రప్రసాద్ భేటీ అయ్యారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసానికి ఆలపాటిని పిలిపించిన చంద్రబాబు బుజ్జగించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన ప్రాధాన్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

click me!