
అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుతో ప్రముఖ సినీ హీరో మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనికా రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశం అటు చిత్ర పరిశ్రమలోనూ, ఇటు తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. మంచు మనోజ్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించడంతో చర్చ తీవ్రమైంది. ఈ నేపథ్యంలోనే భూమా మౌనికా రెడ్డి అరంగేట్రం కన్ఫామ్ అని, ఆమె నంద్యాల నుంచి పోటీ చేస్తారనీ వార్తలు వచ్చాయి. ఆమె రాజకీయాల్లోకి రావాలని కోరుకునేవారూ లేకపోలేదు. ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియను, నంద్యాల ఉపఎన్నికలో సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించడంలోనూ మౌనికా రెడ్డి కీలక పాత్ర పోషించారు. దీంతో ఆమె రాజకీయాల్లోకి రావాలని కొందరు కోరుకుంటున్నారు. రాజకీయాల్లోి రావడానికి మౌనికా రెడ్డి కూడా ఆసక్తి చూపించడంతో.. నంద్యాల నుంచి ఆమె పోటీ చేసే ఛాన్స్ ఉన్నదనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఈ సందర్భంలోనే మౌనికా రెడ్డి సోదరుడు, టీడీపీ యంగ్ లీడర్ భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి గురువారం విలేకరులతో మాట్లాడారు. మంచు మనోజ్ దంపతులు చంద్రబాబుతో భేటీ కావడంపై స్పందించారు. భూమా ఫ్యామిలీ అంతా ఒక్కటిగా ఉన్నామని ఆయన చెప్పారు. మంచు మనోజ్, మౌనికా రెడ్డిలు చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిశారని వివరించారు. నంద్యాల ఎన్నికల బరిలో తానే ఉన్నానని స్పష్టం చేశారు. భూమా మౌనికా రెడ్డి నంద్యాల నుంచి పోటీలో లేరని చెప్పారు. అయితే, నంద్యాల నుంచి టీడీపీలో టికెట్ కోసం పోటీ ఉన్నదని, వైసీపీలోనూ ఆ పోటీ కనిపిస్తుందని వివరించారు.
Also Read: ఉల్లి వాసనతో బెంబేలు.. ‘అగ్ని వ్యాపించిందని ప్రయాణికుల భయాలు’.. ఫ్లైట్ రివర్స్
భూమా అఖిల ప్రియ ఆళ్లగడ్డపైనే దృష్టి పెట్టాలని పార్టీ అధిష్టానం ఇప్పటికే ఆమెకు చెప్పిందని విఖ్యాత్ వివరించారు. తన తండ్రి భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాణాలు విడిచిన నంద్యాల నుంచే తాను పొలిటికల్ కెరీర్ ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. ఎవరికి సత్తా ఉందా.. ఎవరు కార్యకర్తలకు భరోసా ఇస్తారో వారికే టికెట్ ఆశిస్తుందని చెప్పారు. టీడీపీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం పని చేస్తానని వివరించారు.