
కరోనా వైరస్‌ను నివారించేందుకు కొవాగ్జిన్, కోవిషీల్డ్‌లను అత్యవసర వినియోగానికి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. తొలి విడతలో ఆరోగ్య కార్యకర్తలు, డాక్టర్లు, ఇతర ఫ్రంట్ లైన్ కార్యకర్తలకు వ్యాక్సిన్ వేయాలని కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది.
దీంతో నాటి నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే టీకా తీసుకున్న తర్వాత కూడా పలువురు కోవిడ్ బారిన పడుతుండటంతో పాటు రియాక్సన్ వస్తున్నాయి.
Also Read:కొత్తగా 125 మందికి పాజిటివ్: ఏపీలో 8,87,591కి చేరిన సంఖ్య
దీంతో వ్యాక్సిన్ సామార్థ్యంపై ప్రజలు, అధికారుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజాగా కృష్ణాజిల్లాలో వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడం.. స్థానికంగా కలకలం రేపుతోంది.
మచిలీపట్నానికి చెందిన ఓ వ్యక్తి కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నాడు. ఆ తర్వాత అతడికి కోవిడ్ టెస్ట్ చేయగా.. పాజిటివ్ వచ్చింది. దాంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సైతం పరీక్షలు చేయించుకోగా.. దాదాపు 8 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.