పసివారిని వేడినీటి బకెట్లో ముంచి, చార్జర్ వైర్ తో కొట్టి.. ముక్కు,నోరు మూసి.. పైశాచికత్వం...

By SumaBala BukkaFirst Published Jan 5, 2023, 7:46 AM IST
Highlights

తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా తమ పంచన చేరిన చిన్నారుల మీద పైశాచికత్వం చూపించాడో వ్యక్తి. వారిని చిత్రహింసలకు గురి చేశాడు. చివరికి విషయం వెలుగులోకి రావడంతో అరెస్టయ్యాడు.

విజయవాడ : నోరులేని, అమాయకులైన చిన్నారులపై జరిగే అన్యాయాలు, అక్రమాలు వెలుగులోకి వచ్చినప్పుడు మనసు వికలమవుతుంది. ఆ పసివారిపై అంతటి క్రూరంగా ప్రవర్తించడానికి ఎలా మనసొప్పిందో అర్థం కాదు. వారిని చిత్రహింసలకు గురిచేసి పైశాచిక ఆనందం పొందుతుంటారు కొంతమంది. అలాంటి ఓ హృదయవిదారకమైన ఘటన  విజయవాడలో వెలుగు చూసింది. వరసకు చిన్నాన్న అయిన ఒకరు.. ముగ్గురు పిల్లలపై అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. తల్లిదండ్రులను కోల్పోయి  చిన్నమ్మ పంచన చేరిన వారు నరకం చూశారు. విజయవాడలోని రామవరప్పాడులో ఈ ఘటన చోటుచేసుకుంది.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..  గన్నవరానికి చెందిన  జ్యోతి అక్కా, బావలు 2017లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారికి ముగ్గురు పిల్లలు. తల్లిదండ్రులు చనిపోవడంతో వీరు అనాధలయ్యారు. దీంతో సొంత అక్క పిల్లలని అలా వదిలేయలేక.. జ్యోతి వారిని చేరదీసి పెంచుతోంది. ఈ క్రమంలో జ్యోతి, రవివర్మతో ప్రేమలో పడింది. 5 నెలల క్రితం వీరు వివాహం చేసుకున్నారు. రామవరప్పాడు సమీపంలో ఉన్న ఓ హోటల్ లో రవివర్మ చెఫ్ గా పని చేస్తున్నాడు.

వైసీపీ అనుబంధ సంఘాల అధ్యక్షుల ప్రకటన.. ఎవరెవరికి ఏ విభాగమంటే..?

హోటల్ వాళ్ళు అక్కడే వీరు ఉండడానికి గది ఇచ్చారు. దీంతో జ్యోతి, రవివర్మలు అక్కడే ఉంటున్నారు. జ్యోతి దగ్గర ఉండే ముగ్గురు పిల్లలు కూడా మూడు నెలలుగా వీరిదగ్గరే ఉంటున్నారు. జ్యోతి ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. జ్యోతి ఇంట్లో లేని సమయంలో.. ఉద్యోగానికి వెళ్లినప్పుడు.. చిన్నారుల మీద రవి వర్మ తన ప్రతాపం చూపించేవాడు. అమానుషంగా ప్రవర్తించేవాడు. చిన్నారుల వీపుపై  కొట్టేవాడు.. గుండెలపై కొట్టేవాడు.. తలను గోడకేసి బాదేవాడు. అతని క్రూరమైన చేష్టలకు చిన్నారులు వణికిపోయేవారు.

వీటన్నింటి కంటే మించి  వేడినీళ్ళ బకెట్లో పిల్లల తలలు ముంచేవాడు. వారు ఊపిరి ఆడకుండా గిలగిలా కొట్టుకుంటుంటే.. ఆనందించేవాడు. సైకో లాగా బిహేవ్ చేసేవాడు. ముక్కు, నోరు గట్టిగా మూసి..  ఆ చిన్నారుల మెడ పట్టుకుని పైకి లేపేవాడు. ఈ విషయం కనుక తన పిన్నితో చెబితే.. కత్తితో మెడ కోసేస్తానని  బెదిరించాడు. అతడి ప్రవర్తనతో అప్పటికే చిగురుటాకులా వణికిపోతున్న చిన్నారులు.. భయపడి ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. ఎప్పుడైనా పిల్లల విషయంలో తేడా గమనించిన జ్యోతి.. రవివర్మ ను ఎందుకు అలా చేస్తున్నావ్ అని అడిగితే.. పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలని, వారు బూతులు మాట్లాడుతున్నారు అని చెప్పేవాడు. 

బుధవారం నాడు కూడా అలాగే రవి వర్మ ఆ చిన్నారులను  సెల్ ఫోన్ చార్జర్ వైర్ తో చావబాదాడు. ఆ తరువాత కాసేపటికి వారు పక్కింట్లో టీవీ చూడడానికి వెళ్లారు. ఆ ఇంటివారు చిన్నారుల శరీరంపై ఉన్న వాతలు చూసి ఏమైందని అడిగారు. వాళ్లు భయపడి చెప్పలేదు. దీంతో వారు వెంటనే రవివర్మ పనిచేసే హోటల్ యాజమాన్యానికి ఈ విషయం తెలిపారు. వారు కూడా అది చూసి షాక్ అయ్యారు. వెంటనే పటమట చైల్డ్ లైన్ వారికి, పోలీసులకు తెలిపారు. పోలీసులు హోటల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు రవివర్మ మీద కేసు నమోదు చేశారు. ఆ తరువాత పోలీసులు రవివర్మను అరెస్ట్ చేశారు. బాధిత చిన్నారులు ముగ్గురిని చైల్డ్ వెల్ఫేర్ స్టేట్ హోంకు పంపించారు. 

click me!