రాయలసీమ హక్కుల సాధన కోసం విద్వాన్ విశ్వం స్ఫూర్తి కావాలి

Published : Apr 08, 2017, 01:20 PM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
రాయలసీమ హక్కుల సాధన కోసం విద్వాన్ విశ్వం స్ఫూర్తి కావాలి

సారాంశం

మధ్యప్రదేశ్ ప్రజలు బాణునిపై ప్రేమతో బాణసాగర్ అనే పేరుపెట్టుకున్నట్టు రాయలసీమ ప్రజలు కూడా విద్వాన్ విశ్వంపై ప్రేమతో రాయలసీమ అస్తిత్వాన్ని నిలబెట్టేందుకు , రాయలసీమ హక్కులను సాధించుకునేందుకు గట్టిగా పోరాడవలసిన సమయం ఆసన్నమైంది.

మనదేశంలో ఎక్కడ ఏ ప్రాజెక్టు ప్రారంభమైనా అది ఒక దివంగత రాజకీయనేత పేరుతో ప్రారంభం కావడం ఒక ఆచారంలా మారిపోయింది.  అటువంటిది ఒక కవిపేరుతో ఒక ప్రాజెక్టు నిర్మింపబడడం అపురూపమే!  ఆ కవి కూడా నిన్నమొన్నటివాడు కాదు, ఎప్పుడో పద్నాల్గువందల ఏండ్లకు ముందరివాడు అంటే ఆశ్చర్యం కలగడం కూడా సహజమే!  ఆ కవి పేరు బాణుడు.  2006 లో జాతికి అంకితమైన ఆ ప్రాజెక్టు పేరు బాణసాగర్.  ఆయన జన్మించిన ప్రీతికూట గ్రామం చెంతనే నేటి మధ్యప్రదేశ్ లో శోణనదిపై కట్టబడటం వల్ల ప్రజలు, ప్రభుత్వమూ ఆయనపై ఎంతో ప్రీతితో ఆ పేరు పెట్టుకున్నారు. 
 
ఆ బాణుడు ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి నవల అయిన "కాదంబరి" ని వ్రాసినవాడు.   సంస్కృతంలో ఆయన వ్రాసిన నవలను రాయలసీమ కవి అయిన  విద్వాన్ విశ్వం ఐదు దశాబ్దాల ముందు తెలుగులోనికి అనువదించారు.  అది అప్పుడే ముద్రింపబడి, సహృదయకరకమలాలను చేరి, వారి హృదయాలను రంజింపజేసింది.  తరువాత తరాలవారికి ఆ పుస్తకం దొరకలేదు.  చాన్నాళ్ల తరువాత ప్రొద్దుటూరుకు చెందిన కవిత పబ్లికేషన్స్ ఆ తెలుగు అనువాదాన్ని మరలా తెలుగు పాఠకలోకానికి అందుబాటులోనికి తెచ్చారు. 
 
విద్వాన్ విశ్వం అనువాదం మూలవిధేయం కావడంవల్ల సంస్కృతపండితులను సులువుగా ఆకట్టుకోగలదు.  ఈ విషయమే తిరుపతిలోని రాష్ట్రియసంస్కృతవిద్యాపీఠంవేదికగా వైస్ ఛాన్సలర్  విరివెంటి మురళీధరశర్మ అధ్యక్షతలో జరిగిన పరిచయ గోష్ఠి నిరూపించింది.  రససిద్ధిని పొందిన కవి స్వతంత్రకావ్యం వెలువరించినప్పటికీ అది రసపరతంత్రంగానే ఉంటుందని (నవరసభరితంగా ఉంటుందని), అటువంటి కావ్యపఠనం వల్ల ఇంతింత అనరాని ఆనందం కలుగుతుందని ఆయన చెప్పారు.  మనకు ప్రతినిత్యమూ కళ్ల  ఎదుటనే కనబడే ఒక సామాన్య విషయం కవి నోటిగుండా వెలువడినపుడు అత్యాశ్చర్యకరమైన మార్పునకు లోనై అద్భుతసౌందర్యాన్ని స్వంతం చేసుకుంటుందని చెప్పారు.  విద్వాన్ విశ్వం అనువాదం కూడా అటువంటిదే అని, ఇటువంటి అనువాదసాహిత్యం సంస్కృతంనుండి తెలుగులోనికి, ఇతరభాషలనుండి సంస్కృతంలోనికి విరివిగా వెలువడాలని ఆకాంక్షించారు. 
 
ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తి బాణభట్టు జీవితవిశేషాలు అతడు వ్రాసిన హర్షచరితంలో లభిస్తాయని చెప్పారు.  బాణుని మూలపురుషుడు వత్సుడు అని, వాత్స్యాయనముని వారి పూర్వీకుడే అని తెలిపారు.  రాజ్యదేవీచిత్రభానులు అతని తల్లిదండ్రులని, బాణుడు బాల్యంలో మాతృవియోగం, యవనారంభదశలో పితృవియోగం కలిగాయని, అందువల్ల అతడు విస్తృతంగా లోకసంచారం చేసి అపారమైన అనుభవం గడించాడని,  ఆ సమయంలో అతడు చూసిన ప్రపంచమే అతని కావ్యాలలో వైవిధ్యభరితమైన రూపుదిద్దుకుని సహృదయులను ఆనందభరితులను చేసిందని చెప్పారు.  పాంచాలి, వైదర్భి, గౌడి  అని రచనారీతులు మూడు ఉన్నాయని, బాణుని వలె  పాంచాలీరీతిలో సంపూర్ణకావ్యాన్ని వ్రాసి మెప్పించగలిగిన కవులు ఇతరులెవరూ లేరని అన్నారు.  "బాణోచ్చిష్టం  జగత్ సర్వం"  అంటారని, అతడు ఒక వస్తువును వర్ణించిన తరువాత మరొకవిధంగా వర్ణించేందుకు మరెవరికీ ఎటువంటి ఆలోచన మిగలదని అన్నారు.   ఆచ్చోదసరస్సును అతడు వర్ణించిన తీరు అనుపమానమని, చెట్లనుండి పండ్లు రాలి ఆ సరస్సులో పడినపుడు నీటిబిందువులు పైకి ఎగసిపడి, ఆ బిందువులగుండా సూర్యకిరణాలు ప్రసరించి ఏడురంగులుగా విడివడుతూ ఆ సరస్సుకు చుట్టూ ఇంద్రధనుస్సులతో కంచె వేసినట్టుగా కనిపించిందని అతడు చేసిన వర్ణన అద్భుతావహమే కాకుండా అప్పటికి పాశ్చాత్యులకు  కూడా తెలియని ఒక శాస్త్రీయాంశాన్ని  కూడా తెలియజేస్తుందని చెప్పారు.
 
ప్రపంచసాహిత్యచరిత్రలో మొదటి నవల కాదంబరి అని, కన్నడ మరాఠీ భాషలలో కాదంబరి అంటే నవల అనే ప్రక్రియగా ముద్రపడిపోయిందని ద్రవిడ  విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ పి వి అరుణాచలం అన్నారు.  బాణుడు వనాలను, నగరాలను, జానపదాలను, పర్వతాలను, ఆశ్రమాలను, దేవభూములను, సరస్సులను, పక్షులను, జంతువులను, సభలను, ప్రసవగృహాలను, జూదశాలలను, జీర్ణదేవాయతనాలను, ప్రజలను, ప్రభువులను, సచివులను, సేవకులను, మిత్రులను, ప్రేయసీప్రియులను,  తాపసులను, ఆటవికులను, వంచకులను, జూదరులను, వారి వారి జీవనవిధానాలను సందర్భానుసారంగా వర్ణించిన రీతి న భూతో  భవిష్యతి అన్న చందంగా ఉందన్నారు.   
 
కేరళ అనే పదం ఆ ప్రాంతానికి ఎప్పుడు వచ్చింది అని తనకు సందేహంగా ఉండిందని, బాణుడు స్వయంగా లేతచిగురులు కేరళ స్త్రీల చెంపలవలె ఎర్రగా ఉంటాయని వర్ణించడంతో ఆరవశతాబ్దినాటికే ఆ పేరు ప్రఖ్యాతమై ఉండేదని తనకు తెలిసివచ్చిందని  అన్నారు.   పంపానదీ  తీరాన ఉన్న పెద్ద బూరుగుచెట్టు చుట్టూ అల్లుకుని ఉన్న లతలు ఒక దృఢకాయుని ఒంటిపై పైకి కనిపిస్తున్న పచ్చని రక్తనాళాలవలె కనిపిస్తున్నాయని బాణుడు ఎప్పుడో ఆరవశతాబ్దంలోనే చెప్పాడని,  కానీ, శరీరంలో రక్తనాళాలు ఉంటాయనే విషయం 17 వ శతాబ్దంలో విలియం హార్వే చెప్పేవరకు ఎవరికీ పాశ్చాత్యులకు తెలియదని అన్నారు.  కాదంబరిలో ఉజ్జయినీనగరపు ఉద్యానవనాలలో మొక్కలను వర్షమువలె తడుపుతూ ఉండిన జలయంత్రాలు నేటి స్ప్రింక్లర్లే అని ఆయన తేల్చేశారు.   సంస్కృతంలో అత్యంతప్రౌఢకవిగా పేరుగాంచిన బాణుడి కావ్యాన్ని అనువదించడం మహాసాహసం అని, కానీ, విద్వాన్ విశ్వం ఆ పనిని అత్యంత సమర్థవంతంగా చేశారని అన్నారు.  Poetry is that, which gets lost in translation అని రాబర్ట్ ఫ్రాస్ట్ అన్నమాటకు ఇది ఒక అపవాదం (Exception) అని ఆయన పేర్కొన్నారు. 
 
విద్వాన్ విశ్వం రాయలసీమ రత్నాలగని అని శ్రీవేంకటేశ్వర  వేదవిశ్వవిద్యాలయానికి మునుపు రిజిస్ట్రార్ గా ఉండిన జి యస్ ఆర్ కృష్ణమూర్తి గారు  ప్రశంసించారు.  బాణుని సుదీర్ఘసమాసాలను ఆయన చిన్న చిన్న పదాలుగా అతిసరళంగా చేసి అనువదించారని అన్నారు. 
 
కాదంబరి కావ్యాన్ని సగం వ్రాసేసరికి బాణునికి తన అంత్యకాలం దగ్గరపడినట్లు తెలిసిపోయిందని, తన ఇద్దరు కుమారులను దగ్గరకు పిలిచి, ఎదుటనున్న ఒక ఎండిన చెట్టును వర్ణించమని అడిగాడని,
అందులో ఒకరు - శుష్కో వృక్షః తిష్ఠత్యగ్రే - అని వర్ణించారని,
వేరొకరు - నీరసతరురిహ విలసతి పురతః -    అని వర్ణించారని,
అపుడు బాణుడు రెండవవారి వర్ణనాచాతుర్యాన్ని మెచ్చుకొని, తన కాదంబరి కావ్యానికి ముగింపు వ్రాసే బాధ్యతను వారికి అప్పగించి తనువు చాలించాడని చెప్పారు.  
 
భారతం సంస్కృతంలో రాసినప్పటికీ, ఆ పేరు వినేసరికి తెలుగువారికి కవిత్రయం ఎలా గుర్తుకు వస్తారో, అలాగే, కాదంబరి సంస్కృతకావ్యమే అయినప్పటికీ, తెలుగువారికి ఆపేరు వినబడితే రాయలసీమ కవి అయిన విద్వాన్ విశ్వం గుర్తుకు రావడం తథ్యం  అని ఘంటాపథంగా చాటారు. 
 
కావ్యం గోపుచ్ఛంలా ఉండాలని,  మూలం ఒకటే అయినా అనేక ఉపకథలతో అలరారుతూ ఉండాలని  శ్రీవేంకటేశ్వర  మ్యూజియమ్స్ డైరెక్టర్ పి  వి రంగనాయకులు అభిప్రాయపడ్డారు.  దానికి చక్కని లక్ష్యం బాణుని కాదంబరి కావ్యం అన్నారు.  కాదంబరి 1846లోనే ఆంగ్లభాషలోనికి అనువదింపబడిందని, 1890లో నిర్ణయసాగర్ దాన్ని ముద్రించారని, క్రమంగా సీయం రిడ్డింగ్, పీవీ కాణే ప్రభృతులు కూడా దానిని అనువదించారని,  కానీ, తెలుగువారికి మాత్రం విద్వాన్ విశ్వం అనువాదం తరువాతనే కాదంబరి చేరువైందని అన్నారు.  కదంబ అనే పదానికి అనేకానేకమైన అర్థాలు ఉన్నాయని, కాదంబరి అనే పేరును బాణుడు ఎందుకు పెట్టి ఉంటాడనే ఆలోచన ఆసక్తికరమైనదని అన్నారు.  కావ్యం అల్లదలచినవారికి బాణుడే  ఆదర్శమన్నారు.  పుస్తకాలను ముద్రించడం అంటే ఏమిటో తెలియని రోజుల్లో, పరిమిత పాఠకులు మాత్రమే ఉండే ఆ రోజుల్లో ఇంతటి ప్రౌఢభాషలో రచింపబడిన కావ్యం గొప్ప ప్రచారానికి నోచుకొనడం చాలా ఆశ్చర్యకరమైన విషయం అన్నారు. 
 
తపస్విని అయినా మహాశ్వేత  వర్ణనము, ఎదిగిన కుమారుని చూచిన తల్లిదండ్రుల పారవశ్యత మొదలైన అంశాలను బాణుడు చక్కగా వర్ణించాడని తెలుగుభాషోద్యమసమితి అధ్యక్షురాలైన గంగవరపు శ్రీదేవి ప్రశంసించారు.
 
తిరుపతి ఆకాశవాణి సంచాలకులైన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఈ గోష్థికి  కూడా సంచాలకులుగా వ్యవహరించారు.  లోకానికి ఉపయోగపడే బాణుడి  రచనలపైన, విద్వాన్ విశ్వం రచనలపైన సదస్సులు పరిశోధనలు జరగాలన్నారు.   కాదంబరిని పునర్ముద్రణ చేసిన యమ్  వి రమణారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.  పుస్తకంలో విద్వాన్ విశ్వం గూర్చి వ్రాస్తూ, రాయలసీమ అస్తిత్వ పోరాటం జరుగుతున్న ఈరోజుల్లో రాయలసీమ వాసుల ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రక్రియలో భాగంగా విద్వాన్ విశ్వం కథలను, అనువాదాలను, భాషను అధ్యయనాంశాలుగా సవీకరించవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
మధ్యప్రదేశ్ ప్రజలు బాణునిపై ప్రేమతో బాణసాగర్ అనే పేరుపెట్టుకున్నట్టు రాయలసీమ ప్రజలు కూడా విద్వాన్ విశ్వంపై ప్రేమతో రాయలసీమ అస్తిత్వాన్ని నిలబెట్టేందుకు , రాయలసీమ హక్కులను సాధించుకునేందుకు గట్టిగా పోరాడవలసిన సమయం ఆసన్నమైంది.

PREV
click me!

Recommended Stories

Ambati Rambabu Pressmeet: చంద్రబాబు, పవన్ పై అంబటి సెటైర్లు | Asianet News Telugu
Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu