
నంద్యాల ఉపఎన్నిక షెడ్యూల్ కోసమే అందరూ ఎదురుచూస్తున్నారు. సరే, ఎన్నికలన్నాక ప్రచారం, బహిరంగసభలు తప్పవుకదా? ఇందులో మళ్ళీ రెండురకాలు. అభ్యర్ధి చేసుకునే ప్రచారం వేరు అభ్యర్ధి తరపున పార్టీలో స్టార్ క్యాంపైనర్ ప్రచారం చేయటం వేరు. ఇపుడదే విషయమై నంద్యాలలో చర్చ మొదలైంది. వైసీపీ తరపున అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కానీ పార్టీ తరపున స్టార్ క్యాంపైనర్ కావాలికదా? వైసీపీ తరపున ఆ హోదా జగన్మోహన్ రెడ్డికి తప్ప రెండో వారికి లేదనే చెప్పవచ్చు. కాబట్టి ఎటువంటి కన్ఫ్యూషన్ లేదు.
మరి టిడిపి పరిస్ధితేంటి? ఎందుకంటే, అధికారపార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబునయుడుతో పాటు చినబాబు నారా లోకేష్ కూడా ఉన్నారు. ప్రచారంలో తండ్రి, కొడుకులిద్దరిలో స్టార్ క్యాంపైనర్ హోదా ఎవరికి దక్కుతుందో అనే చర్చ మొదలైంది. లోకేష్ మంత్రి అయిన తర్వాత వస్తున్న మొట్టమొదటి ఉపఎన్నిక ఇది. అందులోనూ రాష్ట్రమంతా నంద్యాలవైపు చాలా ఆశక్తిగా చూస్తోంది. కాబట్టి ఈ ఎన్నికను చంద్రబాబు ఆషామాషీగా తీసుకునే వీల్లేదు. అందుకనే తండ్రి, కొడుకులు ఇప్పటికే నియోజకవర్గంలో ఓ సారి పర్యటించారు. మళ్ళీ శనివారం నంద్యాలలో పర్యటిస్తున్నారు చంద్రబాబు. తర్వాత ఉపఎన్నిక బాధ్యత లోకేష్ కు అప్పజెబుతారని ప్రచారం జరుగుతోంది.
కాకపోతే ఇప్పటికిప్పుడు కాదని, కీలక సమయంలో చంద్రబాబే స్టార్ క్యాంపైనర్ అంటూ లోకేష్ ను రంగంలోకి దింపుతారని స్ధానిక నేతలంటున్నారు. అదెలాగంటే, టిడిపి గెలుపుకు కావాల్సిన లాంచింగ్ ప్యాడ్ మొత్తాన్ని చంద్రబాబే తెర వెనుకనుండి సిద్ధం చేసేస్తారు. తెరపైన మాత్రం లోకేషే కనబడతారట. ఇటీవల నియోజకవర్గంలో పంపిణీ అయిన ట్రాక్టర్లను లోకేష్ చేతుల మీదుగా లబ్దిదారులకు ఇప్పించటం ఇందులో భాగమే అంటున్నారు.
త్వరలో పంపిణీ చేయబోయే ఇళ్ల పట్టాలు, ట్రాక్టర్లు, రేషన్ కార్డులు, ఫించన్లను కూడా లోకేషే లబ్దిదారులకు అందిస్తారట. శనివారం జరగబోయే బహిరంగ సభలో మచ్చుకి కొన్నింటిని తాను పంపిణీ చేసి మిగిలిన వాటిని లోకేష్ చేతులమీదుగా చేయించాలని చంద్రబాబు ఆలోచనట.
అంటే, టిడిపిలో స్టార్ క్యాంపైనర్ లోకేషే అని అందరూ గుర్తించాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యంగా కనబుడుతోంది. ఎన్నికల్లో టిడిపి గెలిస్తే లోకేష్ వల్లే గెలిచిందని లోకమంతా చెప్పుకోవాలి. మరి ఓడిపోతే... తాను ప్రచారం చేయలేదు కాబట్టి, వైసీపీ అక్రమాలకు పాల్పడింది కాబట్టి, స్ధానిక నేతలు సమన్వయంతో పనిచయేలేదు కాబట్టి, నంద్యాల ఓటర్లు తప్పుచేసారు కాబట్టే టిడిపి ఓడిపోయిందని చెప్పినా చెప్పగల సమర్ధుడు చంద్రబాబు. ఏమంటారు? ఎవరికైనా డౌటా?