
గుంటూరు రైతుదీక్షలో జగన్ మాట్లాడుతూ లోకేష్ పై చేసిన ‘లో-క్యాష్’ అనే కామెంట్ తో చినబాబు నారాలోకేష్ కు బాగా మండినట్లే కనబడుతోంది. అందుకే విశాఖపట్నం జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్న లోకేష్ కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూ దొంగబ్బాయ్(జగన్ను ఉద్దేశించి) అంటూ జగన్ పేరెత్తకుండానే పదే పదే విరుచుకుపడ్డారు. సరే చేసిన ఆరోపణల్లో ఏవీ కొత్తవి కావనుకోండి అది వేరే సంగతి. అయినా, జగన్ ప్రస్తావన తేవటంలోనే లోకేష్ ఎంత మండిపోతున్నారో అర్ధమవుతోంది.
చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కష్టపడుతుంటే దొంగబ్బాయ్ రాష్ట్రం అభివృద్ధి కాకూడదని కుట్రలు చేస్తున్నాడట. కులం, మతం, ప్రాంతాన్ని వాడుతూ మన మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నాడు...తండ్రి, కొడుకుల మధ్య కూడా చిచ్చు పెట్టాలని దొంగబ్బాయ్ అవినీతి పేపర్ ప్రయత్నించింది...దొంగబ్బాయ్ పేపర్ చదవటం, స్మోకింగ్ చేయటం కన్నా ప్రమాదకరం..ఇలా కామెంట్లు చేస్తూ లోకేష్ తన కసిని తీర్చుకున్నారు.
అయితే, లోకేష్ మరచిపోయిన విషయం ఒకటుంది. పార్టీలో ఎవరు సాక్షి పేపర్ చదువుతారో తెలీదు గానీ తన తండ్రి చంద్రబాబునాయుడు మాత్రం క్రమం తప్పకుండా సాక్షి దినపత్రికను స్పష్టంగా చదువుతారన్న విషయం రుజువులతో సహా అందరికీ తెలిసిపోయింది. ఇక, పార్టీపెద్దల ఒత్తడి మేరకే తాను మంత్రిపదవిని చేపట్టినట్లు చెప్పుకున్నారు. మంత్రిపదవి ఎలా వచ్చిందని లోకేష్ ను ఎవరైనా అడిగారా? గుమ్మడికాయల దొంగ అంటే బుజాలు తడుముకున్నట్లు లేదు.