రేపో మాపో గాలిగాడు జైలుకి... ప్రతి ఒక్కడికీ జీవితాంతం గుర్తిండిపోయే శిక్ష ఖాయం: లోకేష్ వార్నింగ్

By Arun Kumar PFirst Published Sep 21, 2021, 5:16 PM IST
Highlights

రేపో మాపో జైలుకి పోయే గాలిగాడిని చూసుకొని రోడ్లపై ఆంబోతుల్లా తిరుగుతున్న ప్రతి ఒక్కడు జీవితాంతం గుర్తుండే శిక్ష అనుభవించడం ఖాయమంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన కామెంట్స్ చేశారు. 

మంగళగిరి: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో సోమవారం వినాయక నిమజ్జనం సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) సీరియస్ అయ్యారు. టిడిపి నాయకురాలి ఇంటిపై దాడిచేసి కాలబెట్టిన వైసిపి(YSRCP) రౌడీ మూకలపై చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.

''జగన్ రెడ్డి ఫ్యాక్షన్ మూకలు రెచ్చిపోతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం కొప్పర్రు గ్రామంలో టీడీపీ నాయకురాలు శారద గారి ఇంటి పై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను'' అన్నారు.

''రేపో మాపో జైలుకి పోయే గాలి గాడిని చూసుకొని రోడ్లపై ఆంబోతుల్లా తిరుగుతున్న ప్రతి ఒక్కడు జీవితాంతం గుర్తుండే శిక్ష అనుభవించడం ఖాయం. వైసీపీ నాయకులు చేసే తప్పుడు పనులకు ఆహా...ఓహో అంటూ కితాబు ఇవ్వడం మాని పోలీసులు శారద గారి కుటుంబ సభ్యుల మీద విచక్షణారహితంగా దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకొకమాట .. ఆ దాడిలో ఒక ఎస్సై కి కూడా గాయాలు అయ్యాయి.. యధావిధిగా వైకాపా మసాజ్ అంటారా పోలీసు సంఘం వారు?'' అంటూ లోకేష్ విరుచుకుపడ్డారు. 

READ MORE  భవిష్యత్ లో కోర్టు బోను ఎక్కక తప్పదు..: గుంటూరు డిఐజికి బుద్దా హెచ్చరిక

 గుంటూరు జిల్లా  కొప్పర్రు గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన ఊరేగింపులో వైసిపి, ప్రతిపక్ష టిడిపి శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగి పరస్పరం రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులు చేసుకున్నారు. వినాయక విగ్రహాన్ని గ్రామంలో ఊరేగిస్తూ తీసుకునివెళుతుండగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఊరేగింపులో పాల్గొన్న వైసిపి, టిడిపి కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగి చివరికి కర్రలు, రాళ్ళతో పరస్పరం కొట్టుకునే స్థాయికి చేరింది. 

ఈ ఘర్షణ పరస్పర దాడులతోనే ఆగలేదు. కోపంతో రగిలిపోయిన వైసిపి శ్రేణులు టిడిపి మాజీ ఎంపిటిసి వేణు ఇంట్లోకి బలవంతంగా చొరబడి అడ్డం వచ్చినవారిని చితకబాదారు. అంతేకాకుండా ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి నిప్పంటించారు. దీంతో పర్నీచర్ సహా ఇల్లు కాలిపోయింది. 

ఊరేగింపు సందర్భంగా బందోబస్తు కోసం వచ్చిన పోలీసుల ఎదుటే ఈ బీభత్సమంతా జరిగింది. వారు పరిస్థితిని అదుపుచేయాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఇరు వర్గాల పరస్పర దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని పోలీసులు అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా వుండటంతో పోలీస్ బలగాలను మొహరించారు. 
 

click me!