విరిగిన కాలితోనే విధులకు... పోలీస్ అధికారిపై ప్రశంసల జల్లు

By Arun Kumar PFirst Published Apr 14, 2020, 12:44 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఓ పోలీస్ అధికారి విధులు నిర్వర్తిస్తూ ఆదర్శంగా నిలిచాడు. 

కడప: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. దీంతో ఇప్పటికే కొనసాగుతున్న లాక్ డౌన్ ను పర్యవేక్షిస్తూ ప్రజలు బయటకు రాకుండా చూడటంలో... ఈ మహమ్మారి వైరస్ ను కట్టడి చేయడంలో పోలీసులు ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే కడప జిల్లాకు చెందిన ఓ పోలీస్ అధికారి అయితే తన అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడటానికి రంగంలోకి దిగాడు. ప్రమాదవశాత్తు కాలు విరిగినా వాకర్ సాయంతోనే రోడ్డుపై విధులు నిర్వర్తిస్తూ తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. 

కడప జిల్లా రాజంపేట అర్బన్ సీఐగా శుభకుమార్ పనిచేస్తున్నాడు. అయితే కొద్దిరోజుల క్రితం పోలీస్ పరేడ్ లో పాల్గొన్న అతడు ప్రమాదానికి గురయ్యాడు. కాలు విరగడంతో విధులకు దూరంగా వుంటున్నాడు. 

అయితే కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ప్రజలు బయటకు రాకుండా చూడటంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ రోడ్లపైనే వుంటూ కరోనా నియంత్రణకై రాత్రీ పగలు పనిచేస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో తన సేవలు అవసరమని భావించిన సీఐ శుభకుమార్ విరిగిన కాలితోనే విధులకు హాజరయ్యాడు. 

వాకర్ సాయంతో నడుస్తూనే లాక్ డౌన్ ను పర్యవేక్షించాడు. ఇలా కరోనాపై పోరాటానికి తాను సైతం అంటూ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారిపై ప్రశంసల  జల్లు కురుస్తోంది. అతడిని స్థానిక నాయకులు, పోలీస్ ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు. ఇలా ఇతర పోలీసులకు ఆదర్శంగా నిలిచాడు శుభకుమార్. 

 

click me!