
స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్నాడు జిల్లా అభ్యర్థులు అత్యధిక మెజారిటీలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. నకరికల్లు మండలంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ నాగోతు వెంకట లక్ష్మి సరోజ తన సమీప సీపీఎం ప్రత్యర్థిపై ఏకంగా 32,919 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇప్పటివరకు నమోదైన ఫలితాల్లో ఇదే అత్యధిక మెజారిటీగా నిలిచింది.
పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలంలో జనసేన తరఫున బరిలోకి దిగిన పామిడిపాటి శ్రీనివాసరావు 30,273 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈ మండలంలో మొత్తం 38 వేల ఓట్లు పోలవగా.. ఆయనకు భారీ మద్దతు లభించింది.
నుజెండ్ల మండలంలో జనసేన అభ్యర్థి సింగంశెట్టి వెంకట బాల ప్రసాద్ 28,863 ఓట్ల తేడాతో గెలుపొందారు. మాచవరం మండలంలో టీడీపీ అభ్యర్థి కత్తి సరోజిని వైసీపీ అభ్యర్థి దొండెటి వెంకయ్యమ్మపై 22,882 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. పిడుగురాళ్లలో కూటమి అభ్యర్థి ఉన్నం దీపిక 20,167 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గురజాలలో టీడీపీ అభ్యర్థి మద్దినేని లక్ష్మి 17 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
పల్నాడు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ పలువురు అభ్యర్థులు గణనీయమైన మెజారిటీలను నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి పుట్టా బ్రహ్మం 21,407 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
కడప జిల్లా వేంపల్లిలో వైసీపీ అభ్యర్థి బట్టల వెంకట శివమ్మ 19,203 ఓట్ల మెజారిటీ సాధించారు. బ్రహ్మంగారిమఠం మండలంలో టీడీపీ అభ్యర్థి నాగిపోగు పుల్లయ్య 17,295 ఓట్ల ఆధిక్యంతో విజయం అందుకున్నారు.
ప్రకాశం జిల్లాలో టీడీపీ అభ్యర్థులు మంచి ఫలితాలు సాధించారు. ముండ్లమూరు జడ్పీటీసీ స్థానంలో మండలాపు సౌమ్య 18,728 ఓట్ల తేడాతో గెలుపొందారు. దొనకొండలో మోడి ఈశ్వరమ్మ 15,785 ఓట్ల ఆధిక్యాన్ని నమోదు చేయగా.. గిద్దలూరులో చెరెడ్డి శ్రీలక్ష్మి 12,616 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నంద్యాల జిల్లా దోనె మండలంలో టీడీపీ అభ్యర్థి రేగటి లక్ష్మీవేదవతి తన సమీప సీపీఐ ప్రత్యర్థి రాజేశ్వరిపై 23,160 ఓట్ల తేడాతో గెలిచారు.
ఎన్నికల ఫలితాల్లో రాజకీయంగా ఆసక్తి రేపిన పరిణామాలు కూడా కనిపించాయి. ఎన్టీఆర్ జిల్లా గణపవరంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ గ్రామంలో దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపొందడం విశేషం. గణపవరం వైఎస్ జగన్ మేనత్త, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి విమలమ్మ స్వగ్రామం కావడంతో ఈ ఫలితం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మరోవైపు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏపీ హోంమంత్రి అనితకు ఎదురుదెబ్బ తగిలింది. నక్కపల్లి-1, నక్కపల్లి-2 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు తుమ్మ కల్పన, గొడుగుల బంగార్రాజు విజయం సాధించారు. ముఖ్యంగా నక్కపల్లి-2 ఎంపీటీసీ పరిధిలోనే హోంమంత్రి అనిత నివాసం ఉండటం ఈ ఫలితానికి ప్రాధాన్యం తెచ్చింది.
కొన్ని ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములు అతి స్వల్ప ఓట్ల తేడాతో నిర్ణయమయ్యాయి. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో టీడీపీ అభ్యర్థి అరుణ కేవలం ఒక్క ఓటు ఆధిక్యంతో గెలిచారు. తొలుత ఆరు ఓట్ల తేడా కనిపించడంతో అధికారులు రీకౌంటింగ్ నిర్వహించారు. తిరిగి లెక్కించిన తర్వాత కూడా అరుణ ఒక్క ఓటుతో విజయం సాధించినట్లు ధ్రువీకరించారు. ఈ ఫలితంపై వైసీపీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు.
పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడిలో టీడీపీ అభ్యర్థి కొల్లి అరుణకుమారి కూడా ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. ప్రత్యర్థి రీకౌంటింగ్ కోరడంతో మరోసారి ఓట్లు లెక్కించిన అధికారులు ఆమె విజయాన్ని ఖరారు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం చంద్రవరం ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కాట్రూ శ్రీనివాసరావు మూడు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అతి తక్కువ ఓట్ల తేడాతో వెలువడిన ఈ ఫలితాలు కౌంటింగ్ ప్రక్రియపై ఉత్కంఠను పెంచాయి.
కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో రాజకీయంగా ఆసక్తికరమైన ఫలితం నమోదైంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కుమార్తె వేర్వేరు పార్టీల నుంచి ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు.
కొత్తపేట-2 స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చాందిని గెలుపొందగా.. పలివెల-2 స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన ఆమె తండ్రి పొనుగుపాటి సత్యనారాయణ కూడా విజయం సాధించారు. ఒకే కుటుంబంలో రెండు వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాలో తండ్రి, కుమార్తె ఒకే పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. పాచిపెంట మండలంలోని మాతుమూరు, పాంచాలి ఎంపీటీసీ స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన జి.యుగంధర్, ఆయన కుమార్తె కావ్య గెలుపొందారు.
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లం గ్రామంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నిక మరో ప్రత్యేకతను సంతరించుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తోడికోడళ్లు ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచారు. ఈ పోరులో కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన బోడపాటి మంగదేవి తన తోడికోడలిపై 18 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల ఫలితాలు పలు ఆసక్తికర పరిణామాలకు వేదికయ్యాయి. ఒకవైపు వేల ఓట్ల మెజారిటీలతో అభ్యర్థులు రికార్డులు సృష్టిస్తే.. మరోవైపు ఒక్క ఓటు తేడాతోనూ విజయాలు నమోదయ్యాయి. కుటుంబ సభ్యులు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేయడం, రెండు దశాబ్దాల తర్వాత కొన్ని ప్రాంతాల్లో రాజకీయ సమీకరణాలు మారడం ఈ ఎన్నికల ప్రత్యేకతగా నిలిచాయి.