ఆంధ్ర ప్రదేశ్ లో ఓవైపు లాక్ డౌన్ కొనసాగుతున్న మరోవైపు వైసిపి నాయకులు అక్రమంగా మద్యం అమ్మకాలను చేపడుతున్నట్లు టిడిపి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.
దేశ వ్యాప్తంగా ప్రజలు లాకౌట్ చేస్తుంటే వైకాపా నాయకులు స్టాక్ అవుట్ చేస్తున్నారని... గజ దొంగల్లా మద్యం షాపులపై తెగబడుతున్నారని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. లాక్ డౌన్ లోనూ ఇసుక, మట్టి మైనింగ్ తో పాటు మద్యం అమ్మకాల ద్వారా అందినకాడికి దండుకుంటున్నారని మండిపడ్డారు. వైకాపా నాయకులు వక్ర మార్గంలో అక్రమంగా దోచుకుంటున్నారని తెలిపారు.
''దేశ వ్యాప్తంగా మార్చి 25 నుంచి లాక్ డౌన్ విధించబడింది. మద్యం షాపులు సంపూర్ణ బంద్ గా ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి వైకాపా నాయకులు మద్యాన్ని రహస్యంగా తరలిస్తూ కరోనా సమయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మద్యం అమ్మకాలలో వైకాపా నాయకులు బహిరంగంగా పట్టుబడినా ఎక్సైజ్ అధికారులు నామమాత్రపు ఫైన్లతో సరిపుచ్చారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న ఎంత మంది మీద కేసులు పెట్టారో ప్రభుత్వం బహిర్గతం చేయాలి'' అని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు.
undefined
''మద్యం షాపుల్లో ఉన్న సరుకు ఏ విధంగా భయటకు వెళుతుందో ప్రభుత్వం నిగ్గు తేల్చాలి. వైన్ షాపుల్లో సరుకును లాక్ డౌన్ కు ముందు ఉన్న లెక్క లాక్ డౌన్ తరువాత లెక్కలను ప్రభుత్వం భయట పెట్టాలి. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి. రాష్ట్రంలో అన్ని మద్యం దుకాణాలు దాదాపు ఖాళీ అయ్యాయి. మూతలు కూడా లేకుండా లూటీ చేశారు. రూ.100 విలువ చేసే మద్యాన్ని రూ.1000 వరకు అమ్ముకోవడం సిగ్గుచేటు'' అని మండిపడ్డారు.
''కరోనా నియంత్రణ పేరుతో కల్లు గీత కార్మికులను ఆపిన ప్రభుత్వం మద్యం ఏరులై పారుతున్నా ఎందుకు ఆపలేకపోతున్నారు? మద్యం మీద ఉన్న ప్రేమ కల్లు గీత కార్మికుల మీద లేదా? ప్రభుత్వం గీత కార్మికులను ఆదుకోవాలి''అని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు.
రేపల్లె నియోజకవర్గంలో యధేచ్చగా మద్యం అమ్మకాలు
అక్రమ మద్యం అమ్మకాలు వైకాపా నాయకుల ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయిందని... తన నియోజకవర్గం రేపల్లెలో మద్యానికి అడ్డాగా మార్చుకున్నారని అనగాని ఆరోపించారు. నియోజకవర్గంలోని నగరం, నిజాంపట్నంలోని మద్యం షాపుల్లో ఒక్క సీసా లేకుండా ఖాళీ చేయడం అధికార పార్టీ దౌర్జన్యానికి అద్దం పడుతోందన్నారు.
''లాక్ డౌన్ ను అధికార పక్షం నేతల ఏ విధంగా ఉల్లంఘిస్తారు? నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎక్కడికి వెళ్లినా మద్యం యద్దేచ్ఛగా దొరకడం సిగ్గుచేటు. అధికారులు కఠినమైన చర్యలు తీసుకోకపోతే అధికారపక్షం నాయకుల విచ్చల విడి తనం వలన నియోజకవర్గంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోయే ప్రమాదం ఉంది'' అంటూ వైసిపి నాయకులపై ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విరుచుకుపడ్డారు.