
రాష్ట్రంలో కమలం పార్టీ వడలిపోతోంది. రేపటి ఎన్నికల సమయానికి అసలు రేకులుంటాయే లేదో కూడా పార్టీ నేతలకే అర్ధం కావటం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండి, రాష్ట్రంలో టిడిపికి మిత్రపక్షంగా ఉండి కూడా వడలిపోతోందంటే ఆశ్చర్యమే.
కొందరు కమలనాధుల ప్రకారం ఇరు పార్టీల్లోని ‘నాయడు బ్రదర్స్’ వల్లే కమలంపార్టీ ఎదుగుదల లేకుండా ఆగిపోయినట్లు సమాచారం. తాజాగా నోట్ల రద్దు దెబ్బ బోనస్.
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు అయినా పార్టీ నేతల్లో ఏమాత్రం ఉత్సాహం కనబడటం లేదు. ఎందుకంటే, పార్టీలో మొదటి నుండి ఉన్న నేతలను గానీ, కొత్తగా వచ్చి చేరిన నేతలను కానీ ఏమాత్రం ఎదగకుండా చూడటంలో నాయడు బ్రదర్స్ అణిచివేతే కారణంగా చెబుతున్నారు.
ఇతర పార్టీల్లో నుండి భాజపాలోకి నేతలను ఆకర్షించేందుకు ఉద్దేశించిన ఆపరేషన్ ఆకర్ష దారుణంగా విఫలమైంది. ఇందుకోసం పార్టీ నాయకత్వం ఇప్పటి వరకూ రెండు కమిటీలు వేసినా ఏమాత్రం లాభం లేకపోయింది. ఎందుకంటే, ఇతర పార్టీల నుండి ఎవరు కూడా భాజపాలో చేరటానికి ఇష్ట పడటం లేదు.
పార్టీలో మొదటి నుండి వున్న వారికే దిక్కులేదంటే కొత్తగా కాంగ్రెస్ నుండి మరికొందరు చేరారు. అందరూ కలిసి ఏమి చేస్తున్నారంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. ఎందుకంటే, పార్టీలో గాని ప్రభుత్వ పరంగా కానీ ఎవరికి ఎటువంటి పదవులూ దక్కలేదు.
కంభంపాటి హరిబాబుకి ఇష్టంలేకున్నా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. కొత్త అధ్యక్షునిగా సోము వీర్రాజును చాలా కాలం క్రింతమే ఎంపిక చేసినా ప్రకటించలేకపోవటాన్ని పలువురు నేతలు ఉదాహరణగా చూపుతున్నారు.
రాజకీయాలన్నాక పదవుల కోసం కాకపోతే ప్రజాసేవ కోసం చేరే వారుంటారా? ఆ మాత్రం ఆలోచన కూడా లేకుండానే ఎవరినీ ఎదగనీయకుండా చేస్తుండటం వల్లే కమలం పార్టీ నుండి వీలైనంత తొందరగా బయట పడాలని పలువురు నేతలు యోచిస్తున్నారు.
ఇందులో భాగమే వైసీపీలోకి వెల్లంపల్లి శ్రీనివాస్ చేరిక. చంద్రబాబునాయదు, వెంకయ్యనాయడులు కలిసి భాజపాలో ఎవరినీ ఎదగనీయకుండా చేస్తున్నట్లు వెల్లంపల్లి చేసిన ఆరోపణల్లో తప్పేమీ లేదని పలువురు నేతలంటున్నారు.
. కాంగ్రెస్ నుండి భాజపాలో చేరిన నేతల్లో కన్నాలక్ష్మీనారాయణ, కాటసానిరాంభూపాల్ రెడ్డి, కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి లాంటి అనేక మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో అత్యధికులు వైసీపీ వైపే చూస్తూండటం గమనార్హం.