
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ హవా ఏమాత్రం తగ్గలేదు. నాలుగున్నరేళ్లుగా ఏపీని పాలిస్తున్న ఆయనను ప్రజలు మళ్లీ ఆదరిస్తారని తెలుస్తోంది. వచ్చే లోక సభ ఎన్నికల్లో వైఎస్సాఆర్ సీపీ పార్టీకే దాదాపు అన్ని సీట్లు అందిస్తారని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. లోక్ సభ ఎన్నికల ప్రజలు ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతారని తెలుసుకునేందుకు ‘టైమ్స్ నౌ’ సర్వే చేపట్టింది. అందులో ఏపీలోని అధికార పార్టీకే ప్రజలు మరో సారి 24-25 అందిస్తారని తేలింది.
గత లోక సభ ఎన్నికల్లో వైఎస్సాఆర్ సీపీ 22 స్థానాల్లో విజయం సాధించింది. అయితే తాజా సర్వే ప్రకారం మరో రెండు, మూడు స్థానాలు ఈ ఎన్నికల్లో పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఏపీ అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని తాజా సర్వే పేర్కొంది. ఏప్రిల్ కూడా ‘టైమ్స్ నౌ’ సర్వే నిర్వహించింది. అందులోనూ వైసీపీ మెజారిటీ సాధిస్తుందని పేర్కొంది. మళ్లీ జూన్ 15- ఆగస్టు 12వ తేదీ మధ్య ప్రజల అభిప్రాయాన్ని సేకరించింది. అందులోనూ దాదాపు అవే ఫలితాలు వస్తాయని తేల్చింది.
కాగా.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి గాలి నామమాత్రంగానే ఉంటుందని తాజా సర్వే పేర్కొంది. టీడీపీకి వచ్చే లోక సభ ఎన్నికల్లో 0-1 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, ఏపీని మళ్లీ పాలిద్దామని చూస్తున్న టీడీపీకి ఇది ఒకింత నిరాశ పరిచే అంశంగానే భావించవచ్చు. అయితే జనసేనను, ఎన్డీఏను లోక సభ ఎన్నికల్లో ప్రజలు ఆదరించే అవకాశం లేదని పేర్కొంది. అవి ఎలాంటి స్థానాలూ గెలుచుకునే అవకాశం లేదని సర్వే పేర్కొంది.