
ఢిల్లీ: ఎవరినైనా కలిసే అధికారం తనకు ఉందని మాజీఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన తాను ఎవరిని కలవాలో అన్న అంశంపై ఆంక్షలు లేవన్నారు. తనకు ఎవరినైనా కలిసే స్వేచ్ఛ ఉందని అది తన సొంత విషయమన్నారు.
ఓ పత్రికాధిపతితో కలిసి చంద్రబాబు నాయుడును కలిశారన్న అంశంపై స్పందించిన ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును కలవడంలో తప్పులేదన్నారు. తాను చంద్రబాబును కలిస్తే ఏపీలో కూడా తెలంగాణ మాదిరిగానే సర్వే విడుదల చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అది సరికాదన్నారు.
గతంలో తాను వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని కలిశానని గుర్తు చేశారు. ఓ ఆహ్వాన పత్రిక నిమిత్తం వైఎస్ జగన్ ని కలవాలని తాను కోరానని అయితే రెస్ట్ తీసుకుంటున్నానని జగన్ చెప్పడంతో ఆయన్ను కలవలేదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలుద్దామని ప్రయత్నించానని అయితే అది కూడా కుదరకపోవడంతో ఫోన్లోనే ఆహ్వానించానని చెప్పుకొచ్చారు.
మరోవైపు తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను ఏపార్టీలోనూ చేరడం లేదన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పానని ఆ మాటకే కట్టుబడి ఉంటానన్నారు.
ఒకవేళ పోటీ చెయ్యాల్సి వస్తే తెలంగాణ నుంచి పోటీ చేస్తానని చెప్పానని అవకాశం వస్తే మాత్రం తెలంగాణ నుంచి పోటీ చేసి తీరుతానని చెప్పుకొచ్చారు లగడపాటి రాజగోపాల్. అంతేకానీ తాను ఆ పార్టీలో చేరుతున్నా ఈ పార్టీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలు కేవలం ఊహజనితమే కానీ వాస్తవం కాదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
తెలంగాణ సర్వే దెబ్బ: ఇక ముందు అలా చెప్పనని లగడపాటి
తెలంగాణ అసెంబ్లీ ఫలితాలపై లగడపాటి సంచలన వ్యాఖ్యలు
లోకసభ ఎన్నికల తర్వాత వాస్తవాలు చెప్తా: తెలంగాణ సర్వేపై లగడపాటి