మంత్రి అఖిలకు నేతల షాక్

First Published Feb 8, 2018, 1:16 PM IST
Highlights
  • తానుండగానే తనపై సిఎంతో నేతలు ఫిర్యాదు చేయటంతో అఖిల బిత్తరపోయారు.

కర్నూలు జిల్లా రాజకీయాల్లో మంత్రి భూమా అఖిలప్రియ ఒంటరైపోయింది. ఇటీవలే చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగిన జిల్లా నేతల సమీక్షలో పలువురు నేతలు నేరుగా చంద్రబాబుకే ఫిర్యాదు చేశారు. తానుండగానే తనపై సిఎంతో నేతలు ఫిర్యాదు చేయటంతో అఖిల బిత్తరపోయారు. నంద్యాల ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి హటాన్మరణంతో కూతురు, ఆళ్ళగడ్డ ఎంఎల్ఏ భూమా అఖిలప్రియకు సిఎం మంత్రివర్గంలో చోటు కల్పించారు.

మంత్రి కాకముందు అఖిల వ్యవహారశైలి ఎలా ఉండేదో తెలీదు. కానీ మంత్రైన దగ్గర నుండి మాత్రం ఒంటెత్తు పోకడలాగే ఉంది. జిల్లాలో ఏ నేతతోనూ సత్సంబంధాలు లేవు. పోనీ శాఖలోని ఉన్నతాధికారులతో మంచి సంబంధాలున్నాయా అంటే అదీ లేదు. శాఖపైన పట్టుకూడా సాధించలేదు. ఈ విషయాలపైనే అఖిలను చంద్రబాబు పలుమార్లు బాహాటంగానే హెచ్చరించిన విషయం అందరికీ తెలిసిందే. అయినా మంత్రి  తీరు మాత్రం మారలేదు.

ఆమధ్య జరిగిన నంద్యాల ఉపఎన్నికల్లో కూడా మంత్రి వ్యవహారం పలు వివాదాలకు దారితీసింది. నియోజకవర్గంలో కీలకమైన ఏవీ సుబ్బారెడ్డితో పడదు. శాసనమండలి ఛైర్మన్ ఎన్ఎండి ఫరూఖ్ తో పొసగదు. జిల్లాలో సీనియర్, ఉపముఖ్యమంత్రి, రెవిన్యూమంత్రి అయిన కెఇ కృష్ణమూర్తి అంటే గిట్టదు. అంతెందుకు స్వయానా మేనమామ, కర్నూలు ఎంఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డితోనే పడదు.  ఇలా ఏ విధంగా చూసినా అఖిలకు శత్రువులే ఎక్కువ. అందుకే ఎవరూ అఖిల దగ్గరకు వెళ్ళరు. అఖిలకు కూడా ఎవరినీ లెక్క చేయదు. నంద్యాల ఉప ఎన్నికలో సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి గెలిచిన తర్వాత అఖిల మరింతగా రెచ్చిపోతున్నారు.

ఇటువంటి నేపధ్యంలోనే చంద్రబాబు జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. దాంతో మంత్రిపై తమకున్న ఆగ్రహాన్నంతా పలువురు నేతలు నేరుగానే వెళ్ళగక్కారు. దాంతో అఖిల ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తానుండగానే తనపై నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తారని అఖిల ఊహించలేదు. నేతల ఫిర్యాదుపై చంద్రబాబు కూడా మంత్రికి ఫుల్లుగా క్లాస్ పీకారు. అంతేకాకుండా జిల్లా సమస్యల పరిష్కారానికి కెఇ కృష్ణమూర్తికి బాధ్యతలు అప్పగించటంతో అఖిలకు ఏమి చేయాలో పాలుపోవటం లేదు.

click me!