టిడిపి చీఫ్ సొంత నియోజవకర్గంలోని కుప్పం మున్సిపాలిటి ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ బూత్ వద్ద టిడిపి అభ్యర్థిని అడ్డుకున్నారంటూ పోలీసులతో ఆ పార్టీ శ్రేణులు వాగ్వాదానికి దిగడం ఉద్రిక్తతకు దారితీసింది.
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు, పోలీసులు అధికార వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఇప్పటికే టిడిపి ఆరోపిస్తోంది. ఇలా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ టిడిపి అభ్యర్థి పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో 16వ వార్డు పోలింగ్ కేంద్రంవద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
TDP పార్టీ అభ్యర్థినైన తననే పోలింగ్ బూత్ లోకి రానివ్వకుండా అడ్డుకుంటారా అంటూ 16వార్డు అభ్యర్టి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆయనకు అక్కడేవున్న టిడిపి శ్రేణులు తోడవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమను పోలింగ్ బూత్ లోకి వెళ్లనివ్వకుండా పోలీసులు తరిమేస్తున్నారంటూ టీడీపీ అభ్యర్థితో పాటు జనరల్ ఏజెంట్ ఆరోపించారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు, ఎంపి రెడ్డప్ప ఘటనా స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు బలగాలను మరింత మోహరించారు.
VIDEO AP Elections:కుప్పంలో జోరుగా... విశాఖ, కొండపల్లిలో మాత్రం మందకోడిగా పోలింగ్
ఇదిలావుంటే ఇదే 16వ వార్డులో ysrcp నాయకులు దొంగఓట్లు వేయించడానికి ప్రయత్నిస్తున్నారంటూ కొందరు స్థానికేతరులను గుర్తించి పట్టుకున్నారు తెదేపా ఏజంట్లు. వీరిని పోలీసులకు అప్పగించారు. అయితే తాము అప్పగించిన దొంగ ఓటర్లను వెంటనే పోలీసులు వదిలిపెట్టారంటూ టిడిపి శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో వారిని పోలీసులు చెదరగొడుతున్నారు.
ఇక ఇప్పటికే అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసిపి అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతోందంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి టిడిపి ఫిర్యాదు చేసింది. కుప్పంతో సహా మిగతాచోట్ల జరుగుతున్న పోలింగ్ లో వైసిపి నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని... దీన్ని అడ్డుకోవాలని ఎస్ఈసీ నీలం సాహ్నీకి ఫిర్యాదు చేసారు. టిడిపి నాయకులు అశోక్‌బాబు, బొండా ఉమ, బోడె ప్రసాద్ ఎస్ఈసిని కలిసి వైసిపి అక్రమాలపై ఫిర్యాదు చేసారు.
READ MORE Kuppam Election: బాబాయ్‌ని గొడ్డలి పోటులాగే... ప్రజాస్వామ్యంపై దొంగఓట్ల వేటు: లోకేష్ ఆగ్రహం
ఇదిలావుంటే కుప్పం మున్సిపల్ ఎన్నిక పోలింగ్ లో అధికార వైసిపి అక్రమాలకు పాల్పడుతుందని... వాటిని అడ్డుకోడానికి సిద్దంగా వుండాలని టిడిపి శ్రేణులకు టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సూచించారు. దొంగ ఓట్లు వేయించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఇలాంటి అక్రమాలకు సంబంధించిన ఆధారాలను సేకరించాలని... వీడియోలు తీసి బయటపెట్టాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా కుప్పంలో పోలింగ్ సందర్భంగా అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసారు. బాబాయ్‌ని గొడ్డలి పోటుతో బలిచేసినట్టే... ప్రజాస్వామ్యాన్ని దొంగ ఓట్ల వేటుతో ఖూనీ చేస్తున్నారు జగన్‌రెడ్డి అంటూ లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డబ్బుతో అత్యంత పవిత్రమైన ఎన్నికల వ్యవస్థని జగన్‌రెడ్డి నడిబజారులో అంగడి సరుకు చేశారని మండిపడ్డారు. టిడిపి నేతల్ని నిర్బంధించి, ఏజెంట్లని అరెస్టుచేసిన పోలీసులు...ఇతరప్రాంతాల నుంచి దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ తీసుకొచ్చినవారిని మాత్రం కుప్పంలోకి ఎలా రానిచ్చారు? అని లోకేష్ ప్రశ్నించారు.