రెడ్డి వారే దొడ్డ వారా జగన్ రెడ్డి గారు...: నామినేటెడ్ పదవుల భర్తీపై కూన రవికుమార్ సంచలనం

By Arun Kumar PFirst Published Jul 20, 2021, 12:53 PM IST
Highlights

ఇటీవల వైసిపి ప్రభుత్వం చేపట్టిన నామినేటెడ్ పదవుల భర్తీలో సామాజిక న్యాయం పాటించలేదని టిడిపి నాయకులు కూన రవికుమార్ ఆరోపించారు. వీటి వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఏం న్యాయం జరిగింది? అని ప్రశ్నించారు.

విశాఖపట్నం: జగన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఏం న్యాయం జరిగింది? కుర్చీలు లేని పదవులు, నిధులులేని కార్పొరేషన్లు ఆయా వర్గాలకు ఇవ్వడం ఎలాంటి సామాజిక న్యాయమో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమర్ డిమాండ్ చేశారు. 

''రాజ్యాంగంలో నిర్వచించిన సామాజిక న్యాయానికి బదులు జగన్ ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగంలోని సామాజిక అన్యాయానికి పాల్పడింది. ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనారిటీల ఆర్థిక ఎదుగుదలకు ఈ ప్రభుత్వం తీసుకున్నచర్యలు శూన్యమనే చెప్పాలి. రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం భర్తీచేసిన 136కార్పేషన్లు ఎవరికి ఇచ్చారు. అధికారాలు, హంగులు, విధులు, నిధులున్న కార్పొరేషన్లు, ఇతరత్రా నామినేటెడ్ పదవులను రెడ్డి  వర్గానికి కట్టబెట్టి  ఏమాత్రం ప్రాధాన్యత లేని, కనీసం తమకుతాము కూడా న్యాయం చేసుకోలేని ఉత్తుత్తి పదవులను ఇతర వర్గాలకు కట్టబెట్టారు. ఇదేమీ సామాజికన్యాయమో ప్రభుత్వమే చెప్పాలి'' అని రవికుమార్ నిలదీశారు. 

''కుర్చీలు కూడా లేని కార్పొరేషన్ల పదవులు బీసీలకు ఇచ్చి వారిని అవమానిస్తారా? బడుగు బలహీనవర్గాల ఓట్లతో అందలం ఎక్కిన ముఖ్యమంత్రి ఇప్పుడు అదే బడుగులను నేడు అణగదొక్కుతున్నాడు. బరువు, బాధ్యతలు బడుగుబలహీన వర్గాలు మోస్తుంటే అధికారమేమో రెడ్లు అనుభవిస్తున్నారు. ఈ వాస్తవాన్ని ప్రతి బీసీ వ్యక్తి గ్రహించాలి. తమకు జరుగుతున్న అన్యాయంపై బడుగు, బలహీన వర్గాలు జగన్ ను, ఆయన ప్రభుత్వాన్ని నిలదీయాలి'' అని సూచించారు. 

read more  మా కార్పోరేటర్ ఇంట్లోకి చొరబడి... మహిళలతో అంత నీచంగానా..: వైసిపి నేతలపై అచ్చెన్న ఫైర్

''చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అసలుసిసలు సామాజిక న్యాయాన్ని పాటించి బడుగులకు అధికారమిచ్చింది. ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ పదవిని టీడీపీ ప్రభుత్వం వర్ల రామయ్యకు ఇస్తే ఈ ప్రభుత్వం మల్లిఖార్జున్ రెడ్డికి ఇచ్చింది. టీటీడీ ఛైర్మన్ గా టీడీపీ హాయాంలో పుట్టా సుధాకర్ యాదవ్ ఉంటే ఇప్పుడు వై.వీ.సుబ్బారెడ్డి ఉన్నాడు. అలానే ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి ని టీడీపీ ప్రభుత్వం యాదవ వర్గానికి చెందిన కృష్ణయ్యకు ఇస్తే జగన్ దాన్ని రోజారెడ్డికి, గోవిందరెడ్డికి ఇచ్చాడు. ఈ విధంగా అనేక పదవులు రెడ్లకే కట్టబెట్టారు. జగన్మోహన్ రెడ్డికి రెడ్డివారే దొడ్డవారా?'' అని మండిపడ్డారు. 

''టీడీపీ  హాయాంలో సివిల్ సప్లయిస్ ఛైర్మన్ గా మల్లెల లింగారెడ్డి ఉంటే ఈనాడు ద్వారపూడి భాస్కరరెడ్డిని నియమించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ పదవిని టీడీపీ ప్రభుత్వం గంటా సుబ్బారావుకి ఇస్తే, నేడు కోడూరు అజయ్ రెడ్డికి ఇచ్చారు.  ఏపీ పోలీస్ హౌసింగ్  కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని టీడీపీ నాగుల్ మీరా కు ఇస్తే, ఈ ప్రభుత్వం మెట్టుకూరి చిరంజీవిరెడ్డికి ఇచ్చారు. శాప్ ఛైర్మన్ పదవిని టీడీపీ హాయాంలో పీ.ఆర్. మోహన్ కు ఇస్తే ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఇచ్చారు'' అన్నారు. 

''టీడీపీ ప్రభుత్వం స్వతంత్ర ప్రతిపత్తికలిగి ఆదాయం వచ్చే కార్పొరేషన్లకు యాదవులను, ఎస్సీలను, మైనారిటీలను అధిపతులను చేసింది. బడుగు, బలహీనవర్గాల రాజకీయ ఎదుగుదలను జగన్మోహన్ రెడ్డి తనపాదంతో అణచివేస్తున్నాడనేది వాస్తవం. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో కేబినెట్ హోదా కలిగిన పదవులు ఏఒక్క బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీకి ఇవ్వలేదు. ప్రభుత్వ సలహాదారుల పోస్టుల్లో బీసీలు, ఎస్సీ, ఎస్టీల వాటా ఎంతో ప్రభుత్వం చెప్పాలి. రాష్ట్రంలో ఆయా వర్గాల జనాభా ఎంత..? ప్రభుత్వమిస్తున్న పదవులెన్ని? రెడ్లను పల్లకీలో ఎక్కించిన జగన్ ప్రభుత్వం బీసీలు, ఎస్సీలు,ఎస్టీలు, మైనారిటీలను మాత్రం ఆ పల్లకీ మోసే బోయీలుగా మార్చింది'' అని రవికుమార్ మండిపడ్డారు. 

 

click me!