
నిజంగా సిగ్గుపడాల్సిన విషయమే. ఏపిలో జరిగిన ఆత్మహత్యపై విద్యార్ధిని కుటుంబానికి న్యాయం చేయమని, నిందుతులను శిక్షించమని తెలంగాణా ప్రభుత్వంతో చెప్పించుకోవటమంటే ఏపి ప్రభుత్వానికి సిగ్గు పోయినట్లే. గుంటూరు మెడికల్ కళాశాలకు చెందిన సంధ్యారాణి అనేక విద్యార్ధిని 20 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నది. సంధ్యారాణి ఆత్మహత్య తరువాత దొరికిన డైరీల్లో ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులే కారణమని ప్రచారం జరిగింది. దాంతో ఇతర విద్యార్ధలుందరూ ప్రొఫెసర్ ను శిక్షించాలంటూ ఆందోళన మొదలుపెట్టారు.
దాదాపు వారం రోజుల ఉద్యమం తర్వాత ప్రభుత్వం సదరు ప్రఫొసర్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయినా విద్యార్ధలు ఆందోళన విరమించకపోవటంతో ప్రొఫెసర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేయటంతో పాటు కేసు నమోదు చేసింది. ఆత్మహత్య ఉదయం వెలుగు చూడటం,విద్యార్ధలుందరూ ఆందోళన మొదలుపెట్టటంతో ప్రొఫెసర్ విధుల నుండి మాయమైంది.
పరారీలో ఉన్న ప్రొఫెసర్ ను పట్టుకోవటానికి ప్రభుత్వం ఏకంగా ఎనిమిది పోలీసు బృందాలను ఏర్పాటు చేయటం గమనార్హం. ఇక్కడ విషయమేమిటంటే, ప్రొఫెసర్ ఏమీ మావోయిస్టు నేత కాదు. వెతకటానికి ఎనిమిది బృందాలను ఏర్పాటు చేయటానికి. ఆమె కుటుంబ సభ్యులను విచారిస్తే ఆమె ఎక్కడున్నదీ వెంటనే తెలుస్తుంది. మరి, పోలీసులు ఆ పని చేసారో లేదో తెలీదు గానీ ప్రొఫెసర్ కోసం వెతుకుతున్నట్లు పోలీసు అధికారులు ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు.
ఘటన జరిగి మూడు వారాలైనా ప్రొఫెసర్ ను పట్టుకోలేకపోవటం వెనుక రాజకీయాలు మొదలవ్వటమే అసలు కారణం. పలువురు అధికార పార్టీ నేతల మద్దతు కారణంగానే ప్రొఫెసర్ ను పోలీసులు పట్టుకోలేకపోతున్నారన్న ఆరోపణలు బాగా వినబడుతున్నాయి. దాంతో ఏపిలో తమకు న్యాయం జరగదని భావించిన విద్యార్ధిని కుటుంబం తెలంగాణా ఐటి, పురపాలక శాఖల మంత్రి కె. తారకరామారావును కలిసి తమ బాధను చెప్పుకున్నది.
వెంటనే స్పందించిన కెటిఆర్ ఏపి వైద్య, ఆరోగ్య శాఖ మంత్ర కామినేని శ్రీనివాస్, డిజిపి సాంబశిరావులతో ఫోన్ లో మాట్లాడారు. నిందుతలను వెంటనే పట్టుకుని శిక్షిస్తే గానీ బాధిత కుటుంబానికి శాంతి జరగదని కెటిఆర్ చెప్పగానే వెంటనే ప్రొఫెసర్ ను పట్టుకుంటామని మంత్రి, డిజిపిలు బదులు చెప్పారు. అవసరమైతే తెలంగాణా సిఎం కెసిఆర్, ఏపి ముఖ్యమంత్రితో కూడా ఈ కేసు విషయమై మాట్లాడుతారని కామినేని, డిజిపిలకు కెటిఆర్ చెప్పటం కొసమెరుపు.