కృష్ణమ్మ మహోగ్ర రూపం... పరివాహక ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం

By Arun Kumar PFirst Published Oct 16, 2020, 1:13 PM IST
Highlights

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలోకి ఊహించని రీతిలో భారీ వరద వస్తోంది.

విజయవాడ: ఎగువన కురుస్తున్న బారీ వర్షాలతో కృష్ణానది ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. నీటి ఉదృతి పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు  వరద హెచ్చరిక జారీ చేశారు. పరివాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

కృష్ణానదిలోకి ఊహించని రీతిలో భారీ వరద వస్తోంది. ప్రకాశం బ్యారేజ్ కి సుమారు లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరీ ముఖ్యంగా నదితీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రకాశం బ్యారేజ్ కి ప్రస్తుతం ఏడున్నర లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంటే, మొత్తం నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. 

ఇక పులిచింతల ప్రాజెక్టుకు కూడా లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం అది క్రమేణ పెరిగే అవకాశం ఉందని... ఈ వరద నీరు విడుదల చేస్తే లోతట్టు ప్రాంతాలన్ని ముంపుకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. జగ్గయ్యపేట నుండి నదీతీర పరీవాహక 18 మండలాల అధికారులందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. 

read more   చంద్రబాబు నివాసానికి పొంచివున్న ప్రమాదం... ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు. మైకు, సోషల్ మీడియా ద్వారా ప్రజలను అత్యవసరంగా అప్రమత్తం చేయాలని సూచించారు.  ఎక్కడిక్కడి ఈ సమాచారం ప్రజలకు చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. నదికి సమీపంలో ఉండటం అతి ప్రమాదకరమని... వెంటనే పునరావస కేంద్రాలకు బాధితులందరికీ తరలించాలని సూచించారు. ప్రజలు వాగులు, వంకలు, కాల్వలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచించారు. 

పులిచింతల నుండి దిగువకు భారీ వరదనీరు కిందకు వదులుతున్నారు. ఇరవైగేట్ల ద్వారా 6,50,000 క్యూసెక్కులు వరదనీటిని కిందకు విడుదల చేస్తున్నారు. పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. గ్రామాలలో వందల ఎకరాలలో పంటలు నీట మునిగాయి. అచ్చంపేట మండలం జడపల్లి తండా,కంచుబోడు తండాలను వరదనీరు చుట్టుముట్టింది. 

తాడువాయి ప్రధాన రహదారిపై వరదనీరు చేరడంతో అచ్చంపేట-మాదిపాడు రాకపోకలు బందయ్యాయి. కోనూరు పంటపొలాలలో ఆరు అడుగుల మేర నీరు నిలిచింది. అమరావతి అమరేశ్వర స్నానఘట్టాలు దాటి వరదనీరు ప్రవహిస్తోంది. 
 

click me!