
కర్నూలు జిల్లాకు సంబంధించి అధికార, ప్రతిపక్షాల్లో పరిణామాలు చాలా వేగంగా జరిగిపోతున్నాయ్. కర్నూలు వైసీపీ ఎంపి బుట్టా రేణుక త్వరలో టిడిపిలోకి ఫిరాయిస్తారని ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో కర్నూలు మాజీ ఎంపి, కేంద్రమాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి త్వరలో వైసీపీలోకి చేరుతారని ప్రచారం ఊపందుకుంది. దాంతో ఇరుపార్టీల్లోనూ రాజకీయ సమీకరణలు చాలా వేగంగా జరగనున్నట్లు సమాచారం.
బుట్టా పార్టీ మారుతున్నారనే ప్రచారం వెనుక కారణాలున్నట్లే కోట్ల వైసీపీలోకి చేరుతారన్న ప్రచారం వెనుకా కారణాలున్నాయ్. బుట్టా విషయంలో కారణాలను పక్కన బెడితే కోట్ల విషయంలో వినిపిస్తున్న కారణాలు మాత్రం సబబుగానే ఉన్నాయి. 2014 తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి అందరికీ తెలిసిందే. విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని జనాలు భూస్ధాపితం చేసేసారు. మళ్ళీ ఎప్పటికి జవసత్వాలు పుంజుకుంటుందో తెలీదు.
అందుకనే పలువురు కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల్లోకి జంపయిపోతున్నారు. మళ్ళీ ఎన్నికలేమో దగ్గరకు వచ్చేస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు కూడా కాంగ్రెస్ లోనే ఉండాలనుకుంటే తమకు తామే ఘోరీ కట్టేసుకున్నట్లే. అందుకు కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబం కూడా మినహాయింపు కాదు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే ఉద్దేశ్యం కోట్ల కుటుంబంలో లేదని అర్ధమవుతోంది. టిడిపిలో చేరటమూ ఇష్టం లేదట. అందుకనే వైసీపీలో చేరాలని కోట్ల నిర్ణయించుకున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై కోట్ల-జగన్ మధ్య రాయబారం కూడా జరిగిందట. బుట్టా టిడిపిలోకి ఫిరాయిస్తే వైసీపీ ఎటూ కొత్త అభ్యర్ధిని వెతుక్కోవాల్సిందే. అభ్యర్ధులంటే ఉంటారు కానీ గట్టి అభ్యర్ధులంటే దొరకటం కష్టమే. అదే సమయంలో కోట్ల కుటుంబానికి గట్టి పార్టీ కూడా అవసరమే. అంటే ఇటు జగన్ కైనా అటు కోట్ల కుటుంబానికైనా ఒకరి అవసరం మరొకరికుంది.
ఈ పాయింటే కోట్ల-జగన్ ఇద్దరినీ కలిపిందట. సరే, ఇప్పటికిప్పుడు కోట్ల వైసీపీలో చేరకపోవచ్చు కానీ చేరటమైతే ఖాయం. కోట్ల వైసీపీలో చేరే విషయం ఖాయమైన తర్వాతే బుట్టా ఫిరాయింపును జగన్ తేలిగ్గా తీసుకున్నారని సమాచారం. పనిలో పనిగా కోట్ల సుజాతమ్మతో పాటు కుమారుడికి కూడా సముచిత స్ధానం కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చారట. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఇంకెన్ని డెవలప్మెంట్స్ జరుగుతాయో చూడాలి.