ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నా మిత్రుడితో చెప్పిస్తారు.. అనిల్ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

By Sumanth KanukulaFirst Published Feb 3, 2023, 11:17 AM IST
Highlights

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి  సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌‌కు నమ్మకద్రోహం చేసి ఉంటే.. తనను సర్వనాశనం చేయాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. 

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి  సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌‌కు నమ్మకద్రోహం చేసి ఉంటే.. తనను సర్వనాశనం చేయాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. తప్పు చేయకుండా ఉంటే దేవుడు తనకు అండగా ఉంటాడని అన్నారు. గతంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే తన కుటుంబం అల్లాడిందని తెలిపారు. అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు బాధ కలిగించాయని అన్నారు. ఏదైనా ఉంటే తనతో మాట్లాడాలని.. పిల్లల ప్రస్తావన ఎందుకని ప్రశ్నించారు.  తన కుటుంబం.. ఆయన కుటుంబం వేరని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. 

చిత్తశుద్దితో పనిచేస్తే తనను అనుమానించారని విమర్శించారు. అనుమానించిన చోట ఉండకూడదని ఆలోచించానని.. అందుకే అధికారాన్ని వదులుకున్నానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని  తన మిత్రుడితో చెప్పిస్తారని అన్నారు. విచారణ జరపకుండా సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. తన అరెస్ట్‌కు రంగం సిద్దం అని లీకులు ఇస్తున్నారని అన్నారు. తనను ఏ నిమిషమైనా అరెస్ట్ చేసుకోవచ్చని అన్నారు. తనను శాశ్వతంగా జైలులో పెట్టుకోవచ్చని చెప్పుకొచ్చారు. కేసులు పెట్టి అలసి పోవాలే తప్ప.. తన గొంతు ఆగే ప్రశ్నే లేదని చెప్పారు. 

తన గొంతు ఆగాలంటే ఒక్కటే పరిష్కారమని.. తనను ఎన్‌కౌంటర్ చేయించండమేనని కోటంరెడ్డి అన్నారు. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎన్నికల వేళ తెలుస్తుందని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడా అనేది ప్రభుత్వం చేతిలో పని అని అన్నారు. ఇప్పుడు తాను రాజీనామా చేసినా ఎన్నికలు ఎలాగూ జరగవని అన్నారు. 

స్థానిక ఎమ్మెల్యేగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రభుత్వం చేసే అభివృద్దికి సహకారం అందిస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. అధికార పార్టీకి దూరంగా ఉన్నా ప్రజాస్వామ్యబద్దంగా ఉద్యమిస్తానని చెప్పారు. ప్రభుత్వం అభివృద్ది పనలు చేస్తే తాను ఉద్యమించాల్సిన అవసరం ఉండదని తెలిపారు. నెల రోజులు పూర్తిగా రాజకీయాలు ఆపేస్తామని తెలిపారు. ప్రస్తుతం గ్రామ దేవత జాతరపై పూర్తి దృష్టి పెట్టామని చెప్పారు. తన వెంట నడిచే కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు ఉంటాయని తెలిపారు. 

click me!