
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మళ్లీ జనంలోకి వెళ్లారు. రెన్నెళ్ల కిందట ఆయన నియోజకవర్గంలో ‘మన ఎమ్మెల్యే , మన ఇంటికి’ పేరుతో జనం మధ్యనే గడిపారు.అయితే, అది ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు జరిపిన యాత్ర. ఇపుడు ఆయన ఎన్నికల ప్రచారం కోసం ప్రతి ఇంటి తలుపుతడుతున్నారు. మొత్తం 366 రోజులు ఆయన నియోజకవర్గంలోని ప్రతి ఓటరుని కలుసుకుంటారు. ఈ ‘ ప్రజాప్రస్థానం’ ఈ రోజు రామలింగాపురం నుంచి అట్టహాసంగా ప్రారంభమయింది. ఉదయం 7 గంటలకు యాత్ర ప్రారంభించారు. ఇంటిసభ్యలందిరిని పలుకరిస్తూ వచ్చే ఎన్నికల్లో తనకు వోటు వేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. తన ప్రచారానికి సంబంధించిన ఒక కరపత్రాన్ని కూడా ఆయన ప్రజలకు పంచుతున్నారు. నియోజకవర్గం నుంచి వందలాది మంది అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ రోజు రామలింగపురానికి వచ్చి కోటంరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఆయన ఒక సారి ప్రతి ఇంటిని సందర్శించారు. ఇది రెండో సారి అవుతుంది. గత యాత్రలో ఆయన ప్రజలంతా పరిచయమయి సన్నిహితులయినందున, ఈ యాత్రలో ప్రతివీధిలో ఒక ఆత్మీయ సమావేశం కూడా ఉంటుందని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే ఇంటి చుట్టూ ప్రజలు తిరగకుండా, ఎమ్మెల్యే యే ప్రజల మధ్య ఉండాలని ఫిలాసఫీ తో తాను ఈ యాత్రకు పూనుకుంటున్నానని ఆయన అన్నారు.