
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి నేత, పార్లమెంటు సభ్యుడు కంభంపాటి హరిబాబు ఎదురు దాడికి దిగారు. కాంగ్రెసు నేత సోనియా గాంధీని తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు కలవడం వెనక మతలబు ఏమిటని ఆయన అడిగారు.
అది టిడిపి, కాంగ్రెసు అవగాహన ఒప్పందంలో భాగమా, భవిష్యత్తుకు సంకేతమా అని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. చంద్రబాబు రామ్ లాల్ గురించి ప్రస్తావించడంపై ఆయన స్పందించారు.
కాంగ్రెసు చెలిమి టిడిపికి మంచిది కాదని ఆయన అన్నారు. కాంగ్రెసు వ్యతిరేక వైఖరిని టిడిపి విడనాడవద్దని ఆయన సలహా ఇచ్చారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీ మీద చంద్రబాబు నిందలు వేస్తున్నారని ఆయన అన్నారు. కర్ణాటకలో బిజెపి అదికారంలోకి రాకుండా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు.
రామ్ లాల్ ను అప్పటి కాంగ్రెసు ప్రభుత్వం గవర్నర్ గా నియమించిందని, ఎన్టీఆర్ ను గద్దె దించినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో బిజెపి కూడా క్రియాశీలక పాత్ర పోషించిందని, ఎన్టీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు.
టిడిపి సహకరించిన సమయంలో బిజెపికి ఆ పార్టీతో పొత్తు కూడా లేదని, బిజెపి మొదటి నుంచి కూడా కాంగ్రెసు వ్యతిరేక వైఖరిని అనుసరిస్తోందని చెప్పారు. ప్రధాని కార్యాలయానికి వైఎస్సార్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు వెళ్తే ఎందుకు విమర్శిస్తున్నారని ఆయన చంద్రబాబును అడిగారు. కేసులు పెడుతారని ఎందుకు భయపడుతున్నారని అన్నారు.
ప్రజలు తనకు రక్షణకవచంగా ఉండాలని చంద్రబాబు ఎందుకు కోరుకుంటున్నారని, బ్లాక్ కమెండోల రక్షణ ఉందని, ప్రజల రక్షణ ఎందుకు, చంద్రబాబును ఎవరేమన్నారని ఆయన అన్నారు.
చంద్రబాబు రాసిన లేఖకు తమ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమాధానం మాత్రమే ఇచ్చారని ఆయన అంటూ ప్రధాని ఏమైనా అన్నారా, అమిత్ షా చంద్రబాబు గురించి ఏమైనా మాట్లాడారా, కేంద్రం నుంచి ఏ విధమైన స్పందన లేకున్నా కేసులు పెడుతారని ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఆ విషయం తెలుసుకోవాలని అన్నారు.