Kondapalli municipality: కొండపల్లి చైర్‌ పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ.. ప్రత్యేక బస్సులో టీడీపీ కౌన్సిలర్లు

By team teluguFirst Published Nov 22, 2021, 10:57 AM IST
Highlights

కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ (kondapalli municipality) చైర్ పర్సన్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎక్స్ అఫిషియో సభ్యులను కలుపుకుంటే.. ప్రస్తుతం టీడీపీకి (tdp) 16, వైసీపీకి(ycp) 15 సభ్యుల మద్దతు ఉంది. 
 

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు నగరపాలకసంస్థ‌కు మేయర్, 12 మునిసిపాలిటీలకు చైర్మన్ల‌కు నేడు ఎన్నిక జరగనుంది. ఇటీవల ఈ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులకు కూడా ఎక్స్‌ అఫిషియో సభ్యుల హోదాలో మేయర్, డిప్యూటీ మేయరు, చైర్మన్, వైస్‌ చైర్మన్ల ఎన్నికలో ఓటువేసే హక్కు ఉంది. అయితే ముందుగా నమోదు చేసుకన్నవారికి ఆయా చోట్ల ఓట్లు వేసే అవకాశం కల్పించినట్టుగా ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ (kondapalli municipality) చైర్ పర్సన్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చైర్ పర్సన్ పీఠం దక్కించుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలో పోటాపోటీగా పావులు కదుపుతున్నాయి. వైసీపీ, టీడీపీలకు సమానంగా సీట్లు (చెరో 14 స్థానాలు) రావడంతో చైర్‌పర్సన్ ఎంపిక ఉత్కంఠ మారింది. అయితే టీడీపీ రెబల్‌గా బరిలో నిలిచిన ఓ అభ్యర్థి విజయం సాధించడం.. ఆ తర్వాత ఆ పార్టీకి మద్దతు ప్రకటించడం జరిగింది. దీంతో వైసీపీ కన్నా టీడీపీ ఒక్క స్థానం ఆధిక్యంలో ఉంది. మరోవైపు రెండు పార్టీలకు ఒక్కో ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. టీడీపీ తరఫున విజయవాడ ఎంపీ కేశినేని నాని (kesineni nani)‌, వైసీపీ తరఫున మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు.  దీంతో టీడీపీకి 16, వైసీపీకి 15 సభ్యుల మద్దతు ఉంది. 

అయితే కోరం ఉంటేనే నేడు చైర్ పర్సన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. చైర్ పర్సన్ ఎన్నిక చేపట్టాలంటే 16 మంది సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. చేతులు ఎత్తడం ద్వారా చైర్ పర్సన్ ఎన్నిక చేపట్టనున్నారు. ఇక, కొండపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే దారుల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 

గొల్లపూడి నుంచి టీడీపీ కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో కొండపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. బస్సుకు రక్షణగా భారీ ర్యాలీగా టీడీపీ శ్రేణులు బయలుదేరారు. కౌన్సిలర్లతో పాటు బస్సులో కేశినేని నాని, దేవినేని ఉమ ఉన్నారు. అంతకు ముందు వీరిద్దరు కౌన్సిలర్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.  

ఇక, కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో వైసీపీ, టీడీపీలు పోటాపోటీగా తలపడిన సంగతి తెలిసిందే. మొత్తం 29 వార్డులు ఉండగా.. అక్కడ టీడీపీ, వైసీపీ చెరో 14 స్థానాల్లో విజయం సాధించాయి. మరో స్థానంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్రీలక్ష్మి విజయం సాధించారు. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో టీడీపీ బలం 15కి చేరింది. 

click me!