Rayala Cheruvu: చిత్తూరు జిల్లాలో ప్రమాదపు అంచున రాయలచెరువు.. 100 గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు.. !

By team teluguFirst Published Nov 22, 2021, 9:54 AM IST
Highlights

చిత్తూరు జిల్లాలోని దాదాపు 100 గ్రామాలు ప్రమాదపు అంచున ఉన్నాయి. జిల్లాలోని అతిపెద్ద చెరువైన.. రామచంద్రాపురం (Ramachandrapuram) మండలంలోని రాయల చెరువు (Rayala Cheruvu).. వర్షాల కారణంగా పూర్తిగా నిండిపోయింది. అయితే చెరువుకు స్వల్ప గండి పడి వరదనీరు లీక్ కావడం ఆందోళనకు గురిచేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలను వర్షాలు (heavy rains) వదలడం లేదు. వరదలతో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. చాలా చోట్ల భారీగా పంట నష్టం జరగ్గా.. ఇప్పటికీ పలు గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. దీంతో చాలా మంది పునరావాస కేంద్రాల్లోనే గడపుతున్నారు. మరోవైపు పలు చోట్ల రోడ్లు, వంతెనలు దెబ్బతినగా.. రైల్వే ట్రాక్‌లు కుగింపోయాయి. అయితే తాజాగా చిత్తూరు జిల్లాలోని దాదాపు 100 గ్రామాలు ప్రమాదపు అంచున ఉన్నాయి. జిల్లాలోని రామచంద్రాపురం (Ramachandrapuram) మండలంలోని రాయల చెరువు (Rayala Cheruvu).. వర్షాల కారణంగా పూర్తిగా నిండిపోయింది. అంతేకాకుండా పలువైపుల నుంచి చెరువుకు భారీగా వరద నీరు చేరుతోంది. అయితే చెరువుకు స్వల్ప గండి పడి వరదనీరు లీక్ కావడం ఆందోళనకు గురిచేస్తోంది.. కట్ట నుంచి మట్టి క్రమంగా జారిపోతున్నట్టుగా అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. చెరువుకు గండి పడకుండా చర్యలు చేపట్టారు. లీకేజ్‌ను పూడ్చడానికి, చెరువు కట్టను పటిష్టపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్  బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే 20 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మరికొన్ని గ్రామాలను కూడా అప్రమత్తం చేశారు. కట్ట నుంచి మట్టి జారుతుండటంతో చెరువు పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

Also read: కడపలో విషాదం: పుట్టినరోజునే బాలికను కబళించిన వరదలు... సోదరుడితో సహా నదిలో గల్లంతు

నిన్నటి నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు చెరువు కట్ట వద్ద ఉండే పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అక్కడే ఉండి.. పరిస్థితిని సమీక్షిస్తునే ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హెలికాఫ్టర్లను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే రేణిగుంట విమానాశ్రయానికి మూడు వైమానిక దళ హెలికాప్టర్లు చేరకున్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బలగాలు కూడా తిరుపతికి చేరుకున్నాయి.

ప్రజలు నిత్యావసర వస్తువులు, ఇతర అవసరమైన సామాగ్రి తీసుకుని ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. జిల్లా కలెక్టర్ హరి నారాయణన్‌ (Harinarayana).. జిల్లా పోలీసు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ టీమ్ అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ముందుజాగ్రత్త చర్యగా అన్ని దిగువ గ్రామాలను ఖాళీ చేయాలని కోరారు. ‘ఇది జిల్లాలోనే అతి పెద్ద చెరువు. చిన్నపాటి లీకేజీ ఉంది. అందుకే ఎలాంటి రిస్క్ తీసుకోకుండా గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం’ అని కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు.

ఏరియల్ సర్వే..
సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు రాయలచెరువులో వరద ఉధృతి పరిశీలించేందుకు హెలికాప్టర్ ద్వారా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరి నారాయణ, అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఇరిగేషన్ శాఖ అధికారులు.. ఏరియల్ సర్వే చేశారు.
 
ఈరోజు కూడా వర్షాలు.. 
దక్షిణ అండమాన్, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరిత ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే వర్షాలతో ఇబ్బంది పడుతున్న జనాలు.. ఎప్పుడు ఏం జరగుతుందో అని వణికిపోతున్నారు. 
 

click me!