మూడేళ్లుగా చంద్రబాబు అపాయింట్‌మెంట్ దొరకడం లేదు.. నా తల్లికి రావాల్సిన గుర్తింపు ఇవ్వలేదు: కోడెల శివరాం

By Sumanth KanukulaFirst Published Jun 1, 2023, 2:25 PM IST
Highlights

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా కన్నా లక్ష్మీనారాయణను నియమిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై ఏపీ శాసనసభ మాజీ స్పీకర్, దివంగత నేత కోడెల శివప్రసాద్ కొడుకు కోడెల శివరాం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా కన్నా లక్ష్మీనారాయణను నియమిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ నిర్ణయంపై ఏపీ శాసనసభ మాజీ స్పీకర్, దివంగత నేత కోడెల శివప్రసాద్ కొడుకు కోడెల శివరాం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు న్యూస్ చానల్స్‌తో మాట్లాడిన కోడెల శివరాం.. బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 

తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి పార్టీకి సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం ఉంటుందని.. అయితే పార్టీ తీసుకున్న నిర్ణయం, తీసుకున్న విధానం తప్పని కోడెల శివరాం అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని.. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు అందరి అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. ఎవరికి చెప్పకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. కోడెల శివప్రసాద్ చనిపోవడానికి ముందు.. చివరిసారిగా సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారని గుర్తుచేశారు. 

అప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీ  పల్నాడు గడ్డ మీద టీడీపీని బలహీనపరిచేందుకు కోడెల శివప్రసాద్‌ను టార్గెట్ చేయడమే ఆయన మరణానికి కారణమని ఆరోపించారు. అయితే అధికారంలో ఉండి నాలుగేళ్లయినా కూడా కోడెల శివప్రసాద్‌ మీద పెట్టిన కేసులను, ఆరోపణలను నిరూపించలేకపోయారని అన్నారు. తాము  ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నామని, అధికారం వస్తుందన్న గ్యారెంటీ లేదని.. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నమ్ముకున్న ప్రజలు, కోడెల ఆత్మీయులకు అండగా నిలబడాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. 

సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా  కన్నా లక్ష్మీనారాయణను ప్రకటించిన తర్వాత ఫోన్ చేసి.. అందరూ సహకరించాలని కోరారని చెప్పారు. మూడేళ్ల క్రితం నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌ను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. కోడెల శివప్రసాద్ మరణం తర్వాత తన తల్లికి రావాల్సిన  గుర్తింపు, గౌరవం ఇవ్వలేదని అన్నారు. గతంలో తనపై పోటీకి ప్రయత్నిస్తున్న వారికి కన్నా లక్ష్మీనారాయణ విషయంలో చెప్పినట్టుగానే ఎందుకు చెప్పలేదని పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. కోడెల శివప్రసాద్‌ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని.. ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చడమే బాధ్యత అని చనిపోయేంత వరకు పనిచేశారని అన్నారు.

కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో రాజశేఖర్ రెడ్డి చెప్పినట్టుగా చంద్రబాబును  తీవ్రంగా దూషించారని.. కేసులు పెట్టారని, టీడీపీ నేతలను ఇబ్బందులకు గురిచేశారని కోడెల శివరాం అన్నారు. తమ కుటుంబంపై జరుగుతున్న వివక్షను, కుట్రను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ వీలుపడలేదని అన్నారు.  చంద్రబాబును కలిసి ఐదు నిమిషాల పాటు తమ ఇబ్బందులు తెలియజేయాలని గత మూడేళ్లుగా చూస్తున్నామని.. కానీ అపాయింట్‌మెంట్ దొరకడం లేదని అన్నారు. తమ కుటుంబం  కోసం ఐదు నిమిషాలు కూడా కేటాయించకపోవడం బాధ కలిగిస్తుందని అన్నారు. 

పార్టీ కోసం త్యాగాలు చేసిన వ్యక్తులకు పదవులు ఇవ్వకపోయినా, గౌరవాన్ని మాత్రం తగ్గించకూడదని అభిప్రాయపడ్డారు. తనను నమ్ముకున్న వారి కోసం తాను నిలబడతానని, తన మద్దతుదారులు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని శిరసావహిస్తానని చెప్పారు. చంద్రబాబుకు తెలియకుండానే ఈ పరిణామాలు జరిగుతున్నాయని.. తమకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచే పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పదవి ఇస్తే ఒక పార్టీ, ఇవ్వకపోతే మరొక పార్టీ అనేది కన్నా విధానమని విమర్శించారు. ఇప్పటికే మూడు పార్టీలను మారి చివరకు టీడీపీలోకి వచ్చారని అన్నారు. 
 

click me!