గుడివాడ వైసిపి టికెట్ విషయంలో నెలకొన్న సస్పెన్స్ కు కొడాలి నాని తెరదించారు. ఈ విషయంపై తాను క్లారిటీ ఇవ్వడమే కాదు వైసిపి అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న మండల హనుమంతరావుతో కూడా క్లారిటీ ఇప్పించారు.
విజయవాడ : మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఈసారి వైసిపి టికెట్ డౌటే అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వైసిపి అదిష్టానం నానిని పక్కనబెట్టి మరో అభ్యర్థికి గుడివాడ టికెట్ ఇవ్వనున్నారంటూ తెగ చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు వైసీపీ విడుదల చేసిన ఇంచార్జీల జాబితాలో గుడివాడ సీటు గురించిన క్లారిటీ లేదు... అందువల్లే ఈ ప్రచారం మొదలయ్యింది. ఇక తాజాగా వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా మండల హనుమంతరావు పేరు ఖరారయినట్లు గుడివాడలో వెలిసిన ప్లెక్సీలు కలకలం రేపాయి. అయితే తాజాగా గుడివాడ వైసిపి టికెట్ పై హనుమంతరావు క్లారిటీ ఇచ్చారు.
ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో పర్యటించారు మండల హనుమంతరావు. ఈ సందర్భంగా నానికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తాను పోటీలో లేనని క్లారిటీ ఇచ్చేసారు. అంతేకాదు నానితో కలిసి ప్రెస్ మీట్ పెట్టిమరీ గుడివాడ టికెట్ తాను ఆశించడం లేదని స్ఫష్టం చేసారు.
తాను గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేయనున్నట్లు జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని హనుమంతరావు పేర్కొన్నారు. వైసిపి అదిష్టానం కొడాలి నానిని కాకుండా తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనుందని... దాదాపు ఇది ఖరారయినట్లు సోషల్ మీడియాలోనే కాదు ప్రధాన మీడియాలోనూ వార్తలు వస్తున్నాయని అన్నారు. అంతేకాదు ఎమ్మెల్యే నానితో తనకు అభిప్రాయబేదాలు వున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు... తాను పోటీచేయడం గానీ, నానిని వ్యతిరేకంగా రాజకీయాలు చేయడంగానీ జరగదని హనుమంతరావు స్పష్టం చేసారు.
Also Read కొడాలి నానికి వైసీపీ షాక్.. గుడివాడ టికెట్ లేనట్టే..!
వృత్తి రిత్యా తాను బిజీగా వున్నాను... దీంతో పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనలేకపోతున్నాను... అందువల్లే ఎమ్మెల్యేతో తనకు అభిప్రాయబేదాలు వున్నట్లు ప్రచారం జరిగి వుంటుందన్నారు. కానీ పార్టీ లైన్ ను, ఎమ్మెల్యే నానిని దాటి వెళ్లబోనని హనుమంతరావు తెలిపారు. వైఎస్సార్ కుటుంబానికి ఎప్పటికీ విశ్వాసంగా ఉంటాను... పార్టీని దెబ్బతీసే పనులు చేయనని అన్నారు. పదవి కావాలి, ఇతర ప్రయోజనాలు కావాలి అనే కోరికలు తనకు లేవని మండల హనుమంతరావు పేర్కొన్నారు.
వీడియో
ఇక కొడాలి నాని కూడా గుడివాడ టికెట్ పై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. కేవలం మార్పులు వున్న నియోజకవర్గాల్లోనే నూతన ఇంచార్జీల ప్రకటన జరిగిందన్నారు. తాను ఎక్కడ నుండి పోటీ చేస్తానో జగన్ చేబుతాడు.. ప్రతి పకోడి గాడు చెబితే మార్చుతారా? అంటూ మండిపడ్డారు. గన్నవరం నుండి వల్లభనేని వంశీ మళ్ళీ పోటీ చేస్తాడు.. తాను గుడివాడ నుండే పోటీ చేస్తానని స్పష్టం చేసారు. తనను గన్నవరంకు మారుస్తున్నారని... గుడివాడలో మరొకరిని బరిలోకి దింపనున్నారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు.