ఆట మొదలు: పాత మిత్రులకు గాలం వేస్తున్న కిరణ్ రెడ్డి

First Published Jul 7, 2018, 11:15 AM IST
Highlights

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం చేసే బాధ్యతను భుజాన వేసుకోవడానికి సిద్ధపడినట్లు కనిపిస్తోంది. తన పాత మిత్రులకు ఆయన గాలం వేస్తున్నారు.

అమరావతి: కాంగ్రెసులో చేరే ముహూర్తం ఖరారు కావడంతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన రాజకీయ క్రీడ ప్రారంభించారు. తన పాత మిత్రులకు గాలం వేయడం  మొదలు పెట్టారు.  నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి ఈ నెల 13న కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. 

తనకు సన్నిహితులైనవారిని, ఇతర పార్టీల్లోకి వెళ్లని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర నేతలను కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 13న ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో, అధిష్ఠానం పెద్దలతో కిరణ్‌ సమావేశమవుతారని పార్టీ వర్గాలు చెప్పాయి. భేటీ అనంతరం కాంగ్రెస్ లో చేరికపై లాంఛనంగా ఆయన ప్రకటన చేస్తారని తెలిపాయి. 
 
రాష్ట్రంలో పార్టీకి తిరిగి ప్రాణం పోయడానికి గతంలో పార్టీలో పనిచేసిన సీనియర్ నేతలను ఆహ్వానించే కార్యక్రమాన్ని కాంగ్రెసు అధిష్టానం చేపట్టింది. అధిష్ఠానం ఆలోచన మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ ఇటీవల హైదరాబాద్‌లో కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య చర్చల సారాంశాన్ని అధిష్ఠానానికి ఊమెన్‌ వివరించారు. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన మంత్రివర్గంలో పనిచేసిన నాయకులను, ఎమ్మెల్యేలను, తదితరులను కిరణ్ రెడ్డి ఫోన్ లో సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.  

click me!