
Free bus ride: ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయాలని టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (APSRTC) ద్వారా ఈ పథకం అమలు కానుంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తుందని ఎదరుచూస్తున్న ఏపీ ప్రజలకు ఇప్పుడు గుడ్ న్యూస్ అందింది.
టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం, మంత్రి అచ్చెన్నాయుడు మీడియాకు వివరాలు అందించారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరో రెండు నెలల్లో అమల్లోకి తీసుకొస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, పశుసంవర్ధక, మార్కెటింగ్, మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంతో రాష్ట్ర మహిళలు APSRTC బస్సుల్లో ఉచితంగా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఏడాదిలో ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. గ్యాస్ సిలిండర్ డెలివరీ తర్వాత రాయితీ సొమ్ము లబ్ధిదారుల అకౌంట్లలో పడుతోంది. సిలిండర్ల విషయంపై కూడా మంత్రి అచ్చెన్నాయుడు అప్డేట్ ఇచ్చారు.
దీపం పథకం కింద సిలిండర్లు తీసుకోకపోయినా మూడు గ్యాస్ సిలిండర్ల నగదును ఒకేసారి లబ్దిదారుల అకౌంట్లో వేస్తామని చెప్పారు. బుకింగ్ చేయకపోయినా, సిలిండర్ తీసుకోకపోయినా ఆర్హత కలిగినవారికి నగదు జమ అవుతుందన్నారు. అలాగే, 2014-19 మధ్యలో నిలిచిపోయిన పెండింగ్ బిల్లులను కూడా త్వరలోనే చెల్లిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కడపలో మహానాడును నిర్వహిస్తున్నామని కూడా మంత్రి పేర్కొన్నారు.
దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు సంఘీభావంగా మే 16, 17, 18 తేదీల్లో తిరంగా ర్యాలీలు నిర్వహించనున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి అన్ని నియోజకవర్గాల్లో ఈ ర్యాలీలు నిర్వహించనున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించిన ప్రధాని మోడీ, త్రివిధ దళాలను పొలిట్‌బ్యూరో ప్రత్యేక తీర్మానంతో అభినందించింది.