
నంద్యాల ఉపఎన్నిక విజయంపై ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి సహచర మంత్రులు ఆదినారాయణరెడ్డి, అఖిలప్రియ గాలి తీసేసారు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నంద్యాల విజయం ఏ ఒక్క మంత్రి క్రెడిట్ కాదని స్పష్టంగా చెప్పారు. కేవలం చంద్రబాబునాయుడు వల్లే నంద్యాలలో విజయం సాధించినట్లు బల్లగుద్ది మరీ చెప్పారు. ఇంతకాలం నంద్యాలలో టిడిపి గెలుపు వల్లే అంటే తమవల్లే అంటూ మంత్రులు అఖిలప్రియ, ఆదినాయాణరెడ్డి క్రెడిట్ క్లైం చేసుకుంటున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
భూమా నాగిరెడ్డిపై ఉన్న సానుభూతి, అభిమానాన్ని జనాలు ఓట్ల రూపంలో చూపారంటూ మంత్రి అఖిల ఎప్పుడో ప్రకటించారు. అదే సమయంలో గోస్పాడు తదితర ప్రాంతాల్లో తాను కష్టపడ్డాను కాబట్టే పార్టీకి మెజారిటీ వచ్చిందని మరో మంత్రి ఆదినారాయణరెడ్డి బాహాటంగానే చెప్పుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే కెఇ కీలక వ్యాఖ్యలు చేసినట్లు కనబడుతోంది. ఎందుకంటే, నంద్యాల ఎన్నికల సమయంలో కానీ తర్వాత కానీ కెఇ పాత్రపై ఎక్కడ కుడా ప్రచారం జరగలేదు. దాంతో కెఇ సహచర మంత్రులపై మండిపడుతున్నట్లు సమాచారం.
అదే విధంగా బైరెడ్డి రాజశేఖరరెడ్డి టిడిపిలో చేరుతారని ప్రచారం ఊపందుకున్నది. రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) తరపున బైరెడ్డి ఓ అభ్యర్ధిని పోటీలో నిలిపారు లేండి. ఆ అభ్యర్ధికి సుమారుగా 150 ఓట్లు వచ్చుంటాయి. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ బైరెడ్డి పార్టీకి వచ్చిన ఓట్లు చూస్తే ఆయన ఏ స్ధాయి నాయకుడో అర్ధమవుతుందంటూ ఎద్దేవా చేసారు. అంటే బైరెడ్డి టిడిపిలో చేరటం కెఇకి ఇష్టం లేదన్న విషయం అర్ధమైపోతోంది.