ప్రధాని మోదీ సమావేశానికి చంద్రబాబు.. దూరంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్ ,కేసీఆర్..

By Sumanth KanukulaFirst Published Aug 6, 2022, 10:09 AM IST
Highlights

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఆజాదీ  కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశం జరగనుంది. 

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఆజాదీ  కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశం జరగనుంది. సాయంత్రం 4.30 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో ఈ సమావేశం ప్రారంభం కానుంది.ఈ కమిటీలో సభ్యులుగా లోక్‌సభ స్పీకర్, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, రాజకీయ నేతలు, అధికారులు, మీడియా ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తలు, కళాకారులు, సినీ ప్రముఖులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులుగా ఉన్నారు. ఈ సమావేశంలో 75 ఏళ్ల  స్వాతంత్ర్య భారతం, హర్ ఘర్ తిరంగాపై చర్చించే అవకాశం ఉంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌పై సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. 

అయితే ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌లు..  ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.  అయితే ఈ రోజు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో.. ఆయన ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పాల్గొంటారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆయన ఈ రోజు సాయంత్రం 8 గంటల సమయంలో ఢిల్లీ చేరుకున్నారు. రాత్రికి వన్ జన్‌పథ్‌లో సీఎం జగన్ బస చేయనున్నారు. ఆదివారం నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం ఢిల్లీ నుంచి రాష్ట్రానికి చేరుకుంటారు. 

ఇక, చంద్రబాబు ఈ రోజు ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళతారు. మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆయన మర్యాదపూర్వకంగా కలవనున్నారు. అనంతరం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జాతీయ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. 

click me!