తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. మరో మూడు రోజుల పాటు వర్షాలు..

By Sumanth KanukulaFirst Published Aug 6, 2022, 9:37 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు, మూడు రోజలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలుచోట్ల రేపటి నుంచి ఈ నెల 9 వరకు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు, మూడు రోజలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలుచోట్ల రేపటి నుంచి ఈ నెల 9 వరకు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయవ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 7న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలలో భారీ వర్షాలు కురవనున్నాయి. మరోవైపు తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలు వీయనున్నాయని పేర్కొంది. 

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. శుక్రవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో 11.7 సెం.మీ భారీ అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ రోజు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో రెండు రోజులు కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో ఆగస్టు 8 వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

తెలంగాణలో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు అరెంజ్ అలర్ట్ ప్రకటించింది. 

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గామాత ఆలయం దగ్గర మంజీరా నది పరవళ్లు తొక్కుతుంది. ఆలయం ముందు భారీగా వరద ప్రభావం కొనసాగుతుంది. దీంతో అధికారులు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి నిత్య పూజలు చేస్తున్నారు. 

click me!