కరెంట్ షాక్ తో లారీ డ్రైవర్ మృతి.. ఐదు లక్షలు ఇప్పిస్తే సరిపోదా? అంటూ ఎస్సై బేరాలు..

By Bukka SumabalaFirst Published Aug 6, 2022, 8:31 AM IST
Highlights

ఓ లారీ డ్రైవర్ కరెంట్ షాక్ తో చనిపోయాడు. అయితే దీనికి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు... అతనికి ఐదు లక్షల రూపాయలు ఇప్పిస్తే సరిపోతుంది కదా అంటూ బేరసారాలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. 

నెల్లూరు : ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారి నడిరోడ్డుపై పంచాయతీ చేయడం నెల్లూరులో చర్చనీయాంశంగా మారింది. కరెంట్ షాక్ తో చనిపోయిన లారీ డ్రైవర్ ప్రాణానికి ఖరీదు కట్టడమే కాకుండా.. ఇదేమిటని ప్రశ్నించిన తోటి డ్రైవర్లను అరెస్టు చేస్తానని బెదిరించాడు. ఈ ఘటన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోచోటు చేసుకుంది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. పొదలకూరు మండలం కనపర్తికి చెందిన మురళీకృష్ణ (37) ముత్తుకూరు మండలం పంటపాడు సమీపంలోని ఓ నూనె కర్మాగారం పార్కింగ్ ప్రాంతంలో విద్యుదాఘాతంతో చనిపోయాడు.

ఈ విషయం మీద ఎస్సై లారీ డ్రైవర్లను పిలిపించి మాట్లాడారు. వీడియో లో ఉన్న వివరాల మేరకు... ‘పార్కింగ్ ప్రాంతం కంపెనీది అయినా అందరూ జాగ్రత్తగా ఉండాలి. విద్యుత్ తీగల కింద లారీ పెట్టి.. పైకి ఎందుకు  ఎక్కాడు? తీగలు తగులుతాయి అన్న విషయం తెలియదా? అన్నింటికీ ఎవరో ఒకరిని బాధ్యులను చేయడం సరికాదు. ఇక్కడ రెండు విషయాలు ఒకటి చట్టప్రకారం కేసు పెట్టడం.. రెండోది కంపెనీతో మాట్లాడి మీకు న్యాయం చేయడం’ అని ఎస్ఐ శివ కృష్ణారెడ్డి చెప్పడంతో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కంపెనీ వైపు మాట్లాడుతున్నారు ఏమిటని డ్రైవర్లు ప్రశ్నించారు.

దీంతో ‘కంపెనీ నిర్లక్ష్యంతోనే చనిపోయాడని మీరంతా రాసి ఇవ్వండి.. అప్పుడు కేసు పెట్టి విచారణ చేస్తాను.. అంతేగాని నాకు రూల్స్ చెప్పొద్దు ఎస్సైగా ఏం చేయాలో నాకు తెలుసు అని హెచ్చరించారు. ‘కంపెనీతో మాట్లాడి రూ. ఐదు లక్షలు ఇప్పిస్తే సరిపోదా?’ అంటూ డ్రైవర్లపై మండిపడ్డారు. దీనికి కోపోద్రిక్తులైన డ్రైవర్లు స్టేషన్ వైపు పరిగెత్తడంతో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై నెల్లూరు గ్రామీణ డీఎస్పీ హరినాథ్ రెడ్డిని వివరణ అడగగా… ముత్తుకూరు ఎస్సై పై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలో వాస్తవం లేదని అన్నారు. అవన్నీ ఆరోపణలే అని తోసిపుచ్చారు. 

ఏపీలో కొత్తగా మరో సలహాదారు నియామకం.. ఏ శాఖ అంటే..

ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలే వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పేరుకేమో ఫ్రెండ్లీ పోలీసింగ్.. కానీ.. హైదరాబాద్‌లో సామాన్యులను చితకబాదడమే తమ పనిగా పెట్టుకున్నారు కొందరు ట్రాఫిక్ పోలీసులు. కొంతమంది చేస్తున్న ఈ ఓవరాక్షన్‌ తో యావత్ డిపార్ట్‌మెంట్‌కే చెడ్డ పేరు వస్తోంది. ఆగస్ట్ మూడో తారీఖున మియాపూర్‌లో ఓ పోలీస్ ఇన్స్‌పెక్టర్ రెచ్చిపోగా.. ఆగస్ట్ 4న కూకట్‌పల్లిలో మరో ఆఫీసర్ ఇలాంటి ఓవరాక్షనే చేశాడు. 

ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్లు వాహనదారులపై చేయి చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. చేయిచేసుకోవడంతో ఆగకుండా.. వాహనదారులను దుర్భాషలాడుతుండడం వివాదాస్పదమైంది. ‘సార్.. ఎమర్జెన్సీ పని మీద వెళ్తున్నానని’.. వాహనదారులు చెబుతున్నా వినిపించుకోకుండా.. చలానా కట్టి ఇక్కడి నుంచి కదలాలని  కూకట్‌పల్లి ఇన్స్‌పెక్టర్ రెచ్చిపోయారు. వీరి అఘాయిత్యాలను చూస్తున్న ఎవరో వీటిని వీడియోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వరుస సంఘటనలపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

click me!