కావలి జనసేన అభ్యర్థిగా పారిశ్రామిక వేత్త సుధాకర్...?

By Nagaraju penumalaFirst Published Feb 13, 2019, 4:56 PM IST
Highlights


అలాంటి సమయం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారని ఆ పార్టీలో చేరితే ప్రజలకు నిస్వార్థంగా సేవ చెయ్యగలమన్న నమ్మకం కుదిరిందన్నారు. రెండేళ్ల నుంచి సొంతూరుకి సేవ చేయాలనే తలంపుతో సేవా కార్యక్రమాలు చేస్తుంటే కొన్ని రాజకీయ శక్తులు ఆటంకం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 
 

నెల్లూరు: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అభ్యర్థులుగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ తాజాగా మరో అభ్యర్థిని  ప్రకటించినట్లు తెలుస్తోంది. 

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామిక వేత్త పసుపులేటి సుధాకర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం  జరుగుతోంది. పార్టీ అధినేత ఆదేశాలతో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నానని చెప్తున్నారు పసుపులేటి సుధాకర్. జనసేన పార్టీ అభ్యర్థిగా తాను పోటీ చేసేందుకు అధినేత పవన్‌ కళ్యాణ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని చెప్పుకొస్తున్నారు. 

కావలి పట్టణ ముసునూరు టీచర్స్‌ కాలనీలో ఆయన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన సమాజసేవ చేయాలన్న తపనతో తాను రాజకీయాల్లోకి రావాలని భావించానని ఆయన స్పష్టం చేశారు. 

అలాంటి సమయం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారని ఆ పార్టీలో చేరితే ప్రజలకు నిస్వార్థంగా సేవ చెయ్యగలమన్న నమ్మకం కుదిరిందన్నారు. రెండేళ్ల నుంచి సొంతూరుకి సేవ చేయాలనే తలంపుతో సేవా కార్యక్రమాలు చేస్తుంటే కొన్ని రాజకీయ శక్తులు ఆటంకం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కావలి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు వచ్చిందన్నారు. పవన్ ఆహ్వానంతో హైదరాబాద్ లో ఆయన నివాసంలో భేటీ అయ్యానని కావలి నుంచి పోటీ చెయ్యాలని కోరడంతో తాను ఆ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో అందర్నీ కలుపుకుపోతానని అందరి సహకారంతో గెలుపొందుతానని పసుపులేటి సుధాకర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

click me!