తలదించుకునే బిడ్డను కన్నావమ్మా అంటూ వైఎస్ విజయమ్మను బాధపెట్టింది నువ్వేగా...

By Nagaraju penumalaFirst Published Feb 13, 2019, 4:00 PM IST
Highlights

వెంటిలేటర్‌పై ఉన్న ఆనం కుటుంబానికి టీడీపీ ఊపిరి పోస్తే హ్యాండ్ ఇచ్చారంటూ ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు రాష్ట్రానికి ఉదయించే సూర్యుడు సీఎం చంద్రబాబని పొగిడిన ఆనం నేడు విమర్శించడం సిగ్గుచేటన్నారు. వెన్నుపోటు, సంస్కారం గురించి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. నువ్వు ఒకటంటే నేను వందంటా అన్న చందంగా ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. 

తాజాగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆనం రామనారాయణరెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ ఆనం రామనారాయణరెడ్డి అంటూ ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్ర మొత్తం ఆందోళనలు చేస్తుంటే ఆనం మాత్రం సీఎం పదవి కోసం వెంపర్లాడారని ఆరోపించారు. 

వెంటిలేటర్‌పై ఉన్న ఆనం కుటుంబానికి టీడీపీ ఊపిరి పోస్తే హ్యాండ్ ఇచ్చారంటూ ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు రాష్ట్రానికి ఉదయించే సూర్యుడు సీఎం చంద్రబాబని పొగిడిన ఆనం నేడు విమర్శించడం సిగ్గుచేటన్నారు. వెన్నుపోటు, సంస్కారం గురించి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

గతంలోవైఎస్ విజయమ్మను అనరాని మాటలు అని ఇప్పుడు ఆదేపార్టీలో చేరి తమను విమర్శిస్తావా అంటూ విరుచుకుపడ్డారు. నిండు అసెంబ్లీలో వైఎస్ విజయమ్మను తలదించుకునే బిడ్డను కన్నావమ్మా అని మాట్లాడింది ఆనం కాదా అని నిలదీశారు. 

జగన్‌ ఉరిశిక్షకు అర్హుడంటూ శాపనార్థాలు పెట్టిన విషయం మరచిపోయారా అంటూ విమర్శించారు. చంద్రబాబును తిట్టేందుకు మోదీ రాష్ట్రానికి వస్తే ఆయన నుంచి వకాల్తా పుచ్చుకుని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 

ముసుగులో గుద్దులాటలు ఎందుకని బహిరంగంగా బీజేపీతో పొత్తును ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేసుల నుంచి బయట పడాలంటే మోదీ జపం చేసుకోండి అంతేకాని చంద్రబాబుని తిడితే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. 

2014 ఎన్నికల్లో ఆత్మకూరు ప్రజలు రామనారాయణరెడ్డిని శంకరగిరి మాన్యాలు పట్టించారని, వచ్చే ఎన్నికల్లోను అదే రిపీట్ అవ్వబోతుందని కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి హెచ్చరించారు. 

click me!