
గుంటూరు: బీజేపీకి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా సమర్పించారు. గురువారంనాడు తన నివాసంలో తన అనుచరులతో కన్నా లక్ష్మీనారాయణ సమావేశమయ్యారు. కార్యకర్తల సమావేశంలో బీజేపీకి రాజీనామా చేయాలనే నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు. కొంత కాలంగా కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. సోము వీర్రాజు తీరుపై కన్నా లక్ష్మీనారాయణ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివప్రకాష్ ఇటీవల కన్నా లక్ష్మీనారాయణతో చర్చించారు. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై కన్నా లక్ష్మీనారాయ న శివప్రకాష్ దృష్టికి తీసుకు వచ్చారు. అయితే పార్టీ నాయకత్వం నుండి సరైన స్పందన లేదనే అభిప్రాయంతో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిన్న రాత్రి తన అనుచరులకు ఆయన సమాచారం పంపారు. ఇవాళ ఉదయం కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి అనుచరులు వచ్చారు. వారితో సమావేశమై బీజేపీకి రాజీనామా చేయాలనే నిర్ణయాన్ని కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు.
అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టుగా కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టుగా కన్నా లక్ష్మీనారాయణ జేపీ నడ్డాకు లేఖ పంపారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కన్నా లక్ష్మీనారాయణ కొనసాగుతున్నారు. గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కన్నా లక్ష్మీనారాయణ పనిచేశారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో ఉన్న సమయంలో నియమించిన ఆరు జిల్లాల అధ్యక్షులను సోము వీర్రాజు ఇటీవల తొలగించారు. రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్న కారణంగానే వారిని తప్పించినట్టుగా సోము వీర్రాజు వర్గం ప్రకటించిన విషయం తెలిసిందే.