12 ఏళ్ల తర్వాత కన్నా,రాయపాటి మధ్య రాజీ: రాయపాటిపై పరువు నష్టం దావా వెనక్కి

By narsimha lodeFirst Published Nov 1, 2022, 9:35 PM IST
Highlights

మాజీ మంత్రి కన్నా  లక్ష్మీనారాయణ, మాజీ  ఎంపీ రాయపాటి  సాంబశివరావుల మధ్య రాజీ  కుదిరింది.  కన్నా లక్ష్మీనారాయణ  రాయపాటి సాంబశివరావుపై వేసిన పరువు నష్టం దావాను వెనక్కి  తీసుకుంటున్నట్టుగా  ప్రకటించారు.  ఇరువురు నేతల మధ్య రాజీ  కుదిరింది. 


గుంటూరు: మాజీ  మంత్రి కన్నా లక్ష్మీనారాయణ,  మాజీ  ఎంపీ  రాయపాటి  సాంబశివరావుల మధ్య  రాజీ కుదరింది. రాయపాటి  సాంబశివరావుపై  దాఖలు చేసిన పరువు నష్టం  దావాను వెనక్కు  తీసుకుంటున్నట్టుగా కన్నా  లక్ష్మీనారాయణ ప్రకటించారు.  కన్నా లక్ష్మీనారాయణపై తాను  చేసిన వ్యాఖ్యలను కూడా వెనక్కు తీసుకుంటున్నట్టుగా రాయపాటి సాంబశివరావు ప్రకటించారు. 12  ఏళ్ల తర్వాత  ఇద్దరి మధ్య  కేసు పరిష్కారమైంది.

పరువు నష్టం కేసు విషయమై  మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావులు  మంగళవారం నాడు గుంటూరు కోర్టుకు హాజరయ్యారు.కాంగ్రెస్  పార్టీలోనే ఉన్న  సమయంలో  ఇద్దరు నేతలు  స్థానిక  రాజకీయాల నేపథ్యంలో  పరస్పరం  విమర్శలు  చేసుకున్నారు.  ఈ  విమర్శల నేపథ్యంలో  2010లో  రాయపాటి సాంబశివరావుపై మాజీ మంత్రి  కన్నా లక్ష్మీనారాయణ  పరువు నష్టం దావా  వేశారు.కన్నా లక్ష్మీనారాయణ  ప్రస్తుతం బీజేపీలో  ఉన్నారు. రాయపాటి సాంబశివరావు టీడీపీలో కొనసాగుతున్నారు.  పరువు నష్టం  దావా కేసు విచారణ పూర్తైందని కోర్టు  ఇవాళ  ప్రకటించింది.తీర్పును రిజర్వ్  చేసింది.  

2010 అక్టోబర్ మాసంలో రాయపాటి  సాంబశివరావుపై కోటి  రూపాయాలకు  పరువు నష్టం దావాను దాఖలు చేశారు కన్నా లక్ష్మీనారాయణ.2010 మే 9వ తేదీన  మంత్రి కన్నా  లక్ష్మీనారాయణపై  ఎంపీగా  ఉన్న  రాయపాటి సాంబశివరావు అవినీతి ఆరోపణలు చేశారు.ఈ  ఆరోపణల నేపథ్యంలో  ఇద్దరి మధ్య వైరం  తీవ్రస్థాయికి చేరుకుంది.దీంతోనే  రాయపాటి  సాంబశివరావుపై కేసు నమోదు  చేశారు.

అవినీతికి పాల్పడిన  కన్నాను మంత్రివర్గం  నుండి తప్పించాలని  అప్పటి  సీఎం రోశయ్యను రాయపాటి డిమాండ్ చేశారు.ఈ  విషయమై  ఎఐసీసీ చీఫ్ సోనియాగాంధీకి కూడ  రాయపాటి  సాంబశివరావు లేఖ రాశారు.
 రాయపాటి సాంబశివరావు చేసిన అవినీతి  ఆరోపణలతో  కన్నా లక్ష్మీనారాయణ తరపు న్యాయవాది సంజీవరెడ్డి  రాయపాటి సాంబశివరావుకు  2010  జూలై 21న లీగల్ నోటీసు పంపారు.అయతే  ఈ నోటీసుకు రాయపాటి సాంబశివరావు  సమాధానం ఇవ్వలేదు. దీంతో  కన్నా  లక్ష్మీ  నారాయణ  మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై కోటి  రూపాయాలకు  పరువు  నష్టం దావా  వేశారు.

click me!