గుంటూరు మేయర్ పీఠాన్ని అప్పగిస్తే ఏం చేస్తామంటే..: కన్నా హామీల వర్షం

By Arun Kumar PFirst Published Feb 25, 2021, 12:55 PM IST
Highlights

 గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ లోని 35వ డివిజన్ బీజేపీ అభ్యర్థి ఏల్చూరి వెంకటేశ్వర్లు ఎన్నికల కార్యాలయాన్ని గురువారం రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. 

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో బిజెపి ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ లోని 35వ డివిజన్ బీజేపీ అభ్యర్థి ఏల్చూరి వెంకటేశ్వర్లు ఎన్నికల కార్యాలయాన్ని గురువారం రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. 

ఈ  సందర్భంగా కన్నా మాట్లాడుతూ... తాను మంత్రిగా వున్న సమయంలోనే గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీలు, నాయకులు గుంటూరు అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో పాలన సాగించిన టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. బీజేపీ - జనసేన కూటమికి అధికారాన్ని అప్పగిస్తే కేంద్ర నిదులతో నగరాన్ని అభివృద్ధి చేస్తామని కన్నా హామీ ఇచ్చారు. 

రాష్ట్ర ప్రజలు కట్టే పన్నులతోనే పాలన సాగిస్తూ అదే ప్రజల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ప్రజలపై ప్రభుత్వం ఇంటి పన్నును పెంచిందని... బీజేపీకి మేయర్ పీఠం ఇస్తే పెంచిన ఇంటి పన్నులు నిలిపివేస్తామని కన్న హామీ ఇచ్చారు. ఇంటి ప్లాన్ , కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్‌లకు ఇలా ఏది కావాలన్నా తప్పకుండా ఎమ్మెల్యేలకు టాక్స్ కట్టాల్సి వస్తుందని... బీజేపీ అభ్యర్థులు గెలిచిన డివిజన్లలో ఎమ్మెల్యే ట్యాక్స్ లేకుండా చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రాంతీయ పార్టీలు చాక్లెట్ ఇచ్చి నెక్లెస్‌లు లాక్కెళుతున్నాయని కన్నా వ్యాఖ్యానించారు.
 

click me!