
కరువు జిల్లాలో పుట్టి, కరువుతో నే పెరిగి పెద్ద వాడయి, ఇపుడుకరువు మీద దండయాత్ర కొనసాగిస్తున్న సామాన్యుడు కాలువ శ్రీనివాసులు.
ఎండిపోయిన వేదవతి(హగరి)నదిలో మళ్లీ నీళ్లు పారించేందుకు రాయదుర్గంలో ఇపుడాయన చాలా బరువయిన పని పెట్టుకున్నారు. ఒక గుళక రాళ్లు చాలుగా తప్ప ఇపుడక్కడ నది కనిపించదు. చట్టు పరిసరా ప్రాంతాల్లో బతుకుని ఏడారి చేస్తూ ఇసుకతిన్నెలు కొండల్లా పెరిగిపోతున్నాయి. గాలి కాలంలో రేగే ఇసుకుతుఫాన్ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. తలనిండా ఇసుక, ఇల్లంతా ఇసుక, వొల్లంతా ఇసుక. ఈ ఇసుక నుంచి ముద్దను కాపాడుకుంటూ బతకాలి. హగరి నదిలో మళ్లీ నీళ్లు పారితే, భూగర్బ జలాలు పెరుగుతాయి. ఏరుపారితే జీవితం చూస్తుండగనే పచ్చబడుతుంది. దీనికోసం హగరి పైనున్న బిటి ప్రాజక్టులోకి కృష్ణా జలాలు మళ్లించేందుకు శ్రీనివాస్ ప్రయత్నించి విజయవంతమయ్యాడు. 2 టిఎంసిలకు హామీ తెచ్చుకున్నాడు. 1300 కోట్ల ప్రాజక్టుకు క్లియరెన్స్ తెచ్చుకున్నారు. హగరి నదిమీద కర్నాటకలో ఒక ప్రాజక్టు కట్టేశారు. దానితో దిగువన ఏరు చచ్చిపోయింది. దీనికి బతికించి తీరుతానంటున్నాడు శ్రీనివాస్.
కరువు శ్రీనివాస్ కు తొలినుంచి తోడుగానే ఉంది. ఎపుడో హిందూపూర్ ఈ నాడు కంట్రిబ్యూటర్ (1989-91) గా ఉన్నపుడు, తర్వాత జిల్లా విలేకరి (1991-99)గా అనంతపురానికి వచ్చినా, కరువే శ్రీనివాస్ ప్రధాన వార్త. తర్వాత ఆయన 1999లో లోకసభ సభ్యుడిగా గెల్చి ఢిల్లీకి వస్తూ తెచ్చింది కూడా కరువునే. లెక్కలేనన్ని కరువు నివేదికలను ఆయన కేంద్రానికి సమర్పించారు. జైసల్మేర్ తర్వాత దేశంలో అతితక్కువ వర్ష పాత ఉన్న జిల్లాఅని పుస్తకాల్లో, ఫైళ్లలో ఉన్న విషయాన్ని పార్లమెంటు దాకా తీసుకువచ్చాడు. ఎంతో మంది నిపుణులను సంప్రదించి, నివేదికలను తయారుచేయింది, వాటి మద్దతుతో కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఇటీవలి కాలంలో, నాకు తెలిసి నంత వరకు, అనేక సార్లు పార్లమెంటులో అడిగిన వాడు కాలువ శ్రీనివాసే. ఈ పోరాటమే హగరి నది దాకా వచ్చింది.
ఫ్యాక్షన్ రాజకీయాలు,డబ్బు రాజకీయాలు బలంగా వేళ్లూని కున్న ఈ రోజులలో పనికొచ్చే వాడుగా ఒక పేద వాడు లీడర్ కంట పడటం కష్టమే. రాజకీయాలలోకి పారిశ్రామిక వేత్తలు, లిక్కర్ కామందులు, టాన్స్ పోర్ట్ అపరేటర్లు, సినిమావాళ్లు, కాంట్రాక్టర్లు ప్రవేశించి సగటు మనిషి చొరబడే జాగా లేకుండా పోయిన రోజులివి. అనంతపురం జిల్లాలో రెండు బలమయిన వర్గాలున్నా ఏవర్గం వైపు మొగ్గచూపని ఏకైక లీడర్ శ్రీనివాసే. ఎవరి సపోర్టు లేకుండా నిలబడినవాడు, ఎవరి ఎండార్స్ మెంట్ లేకుండా పైకొచ్చిన వాడు. ఈ రాజకీయాల్లోకి రావడం, నిలబడటం, అందరికి, ముఖ్యంగా నాయకుడికి కనిపించేలా మసలుకోవడం అంతసులభం కాదు. ముఖ్యమంత్రి వస్తున్నాడంటే, లక్షలు కుమ్మరించి జనాల్ని సమీకరించేంత బలాఢ్యుడుకాదు. ఈల వేసి వేల మందిని పరిగెత్తించే పాలెగాడు కాదు. మరిశ్రీనివాస్ గొప్పదనమేమిటి... మనం చూసే ఏరాజకీయ నాయకుడి లక్షణాలేవీ లేక పోవడం.
అనంతపురం దగ్గిర బుక్కరాయసముద్రం అనే వూరుంది. దానిపక్కన అగ్రహారం అనే కుగ్రామం అంది. అక్కడి ఒక దర్జీ కుటుంబం నుంచి శ్రీనివాస్ వచ్చాడు. అదే కుగ్రామం ఒరవడి ఇపుడూ అతని జీవితంలో కొనసాగటం చేస్తే శ్రీనివాస్ అంటే ముచ్చటేస్తుంది. ఎపుడయినా తీరిక ఉన్నపుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్లండి. వచ్చి పోయే జనాలను గమనించండి. దాదాపు 17 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా ఆయన మెయిన్ స్ట్రీమ్ కాలేకపోయాడు.
అనంతపురం కోవూర్ నగర్ ప్రాంతంలోని ప్రజలంతా టెర్రరైజ్ పోయేంత స్పీడుగా ఎస్ యు వి లను తోలుకుంటూ వచ్చి సడన్ బ్రేక్ వేసి భయపడించే రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, బిజినెసోళ్లు ఆయన ఇంటి దగ్గిర కనిపించరు. చిన్న చిన్న సాయంకోసం వచ్చే బోయోళ్లు, సాలోళ్లు, తొగటోళ్లు, గొల్లోళ్లు,కురబోళ్లే, ఎస్సీవోళ్లు, కాపోళ్లు,తురుకోళ్లు. పెద్ద సంఖ్యలో ఉంటారు.
జీవితం కూడా పల్లెటూరి నుంచి బయటపడలేదు. వుగ్గాని బ్రేక్ ఫాస్ట్, రాగిముద్ద తప్పనిసరిగా కనిపిస్తాయి. డబ్బు రాజకీయాలు ఆయన నడ్డి విరచలేకపోయాయి. ఆయన సామాజిక నేపథ్యం ఛాయలు ఇళ్లంతా తారాడుతూ కనబడతాయి. మైనస్ రాజకీయాలు, శ్రీనివాస్ నిలువెత్తు పేదల మనిషి. తెలుగు దేశానికి వెల కట్టలేని ఆస్తి.
ఇపుడు సమాచారశాఖ, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ లమంత్రిగా, ఆయన విప్లవాలు తీసుకురాలేకపోయినా, నలుగురికి కచ్చితంగా ఉపయోగపడతాడు. టిడిపికి పేరు తెచ్చే వాళ్లెవరయిన ఉంటే, వాళ్లలో శ్రీనివాస్ పేరును ముందు చప్పుకునే లా పనిచేస్తాడు.