
పార్టీ మారాలనుకున్న వారు ముందుగా తమ పదవులకు రాజీనామాలు చేయాలట...ఎలాగుంది వెంకయ్యనాయుడు చెబుతున్న నీతులు? ‘ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులుఉన్నాయ’ని వెనకటికొక పాట ఉందిలేండి. అలాగే ఉంది వెంకయ్య మాటలు. అటువంటి నీతులన్నీ చెప్పేటందుకే కానీ ఆచరణకు కాదని బహుశా వెంకయ్య, ఆయన అనుంగు మిత్రుడు చంద్రబాబునాయుడు లాంటి వాళ్ళను చూసే పుట్టినట్లున్నాయ్. మీడియాతో వెంకయ్య ఫిరాయింపులపై మాట్లాడుతూ, పార్టీ మారాలనుకున్న నిరభ్యంతరంగా మారవచ్చన్నారు. అయితే, ముందుగా తమ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామాలు చేయాలంటూ గట్టిగానే చెప్పారండోయ్.
మరి, ఫిరాయింపులపై అంతేసి నీతులు చెబుతున్న వెంకయ్య గారికి ఏపిలో తమ మిత్రపక్షం టిడిపి చేస్తున్న పనులు తెలియటం లేదా? గడచిన మూడేళ్ళుగా వైసీపీని చీల్చి చెండాడటానికి చంద్రబాబునాయుడు అనుసరించని పద్దతులు లేవన్న విషయం వెంకయ్యకు తెలీదా? తెలిసీ ఓ వైపు చంద్రబాబును సమర్ధిస్తూనే ఇంకోవైపు ఫిరాయింపుల గురించి నీతులు బొంకంటం వెంకయ్యకే చెల్లింది. ఫిరాయంపులతో రాజీనామాలు చేయించమని చంద్రబాబుకు చెప్పవచ్చు కదా? వారితో రాజీనామాలు చేయించి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళమని ఎందుకు గట్టిగా చెప్పలేకున్నారు? ఎన్నికలను ఎదర్కొనే ధైర్యం లేకేనా?
ఫిరాయంపుల అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలట. అక్కడికేదో ఉన్న చట్టాలను బాగా అమలు చేస్తున్నట్లు. ఫిరాయింపులపై నీతులు చెప్పేముందు ఉత్తరాఖండ్ లో తమ పార్టీ చేసిందేమిటో గుర్తులేదా? సుప్రింకోర్టు మొట్టికాయలు ఎందుకు వేసిందో? మొన్ననే కదా ఢిల్లీలో ఆప్ ఎంఎల్ఏను భాజపాలోకి ఆహ్వానించి మరీ కండువ కప్పారు? ఇలాంటి వాళ్ళు నీతులు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సామాన్య జనాలు రాజకీయాలంటే ఏవగించుకుంటున్ననారు.