వివేకా కేసు.. సునీత సీబీఐ వాంగ్మూలంపై అనుమానాలున్నాయి, నన్ను ఇరికించే కుట్ర : అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Apr 25, 2023, 10:26 PM ISTUpdated : Apr 25, 2023, 10:31 PM IST
వివేకా కేసు.. సునీత సీబీఐ వాంగ్మూలంపై అనుమానాలున్నాయి, నన్ను ఇరికించే కుట్ర : అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు

సారాంశం

వైఎస్ వివేకా కేసులో సునీత సీబీఐకి ఇచ్చిన తొలి వాంగ్మూలంలో తేడా వుందన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. వివేకా హత్య రోజున తాను జమ్మలమడుగు వెళ్తున్నానని.. ఈ కేసులో సీబీఐ తనను కుట్రపూరితంగా ఇరికించాలని చూస్తోందన్నారు.  

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ.. రేపో మాపో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సునీత సీబీఐకి ఇచ్చిన తొలి వాంగ్మూలంలో తేడా వుందన్నారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలంపై తమకు అనుమానాలు వున్నాయని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. సీబీఐ ఒక్క కోణంలోనే దర్యాప్తు చేస్తోందని ఆయన ఆరోపించారు. 

ఈ కేసులో సీబీఐ తనను కుట్రపూరితంగా ఇరికించాలని చూస్తోందన్నారు. వివేకా హత్య కేసు ఛేదన కంటే తనను ఇరికించేందుకే సీబీఐ ఎక్కువగా ప్రయత్నిస్తోందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఒక ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుడి పరిస్ధితి ఏంటని ఆయన ప్రశ్నించారు. వివేకా హత్య రోజున తాను జమ్మలమడుగు వెళ్తున్నానని.. ఆ సమయంలో శివప్రకాశ్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చినట్లు అవినాష్ రెడ్డి తెలిపారు.

Also Read: వివేకా కేసు.. ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా, పులివెందులకు చేరుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి

వివేకా హత్య రోజున తాను ఇంట్లోనే వున్నట్లు చూపించి తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని.. ఆ రోజున తనతో పాటు 20 మందికి పైనే జమ్మలమడుగు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వివేకా రాసినట్లుగా వున్న లేఖ, సెల్‌ఫోన్‌ను సాయంత్రం వరకు ఎందుకు దాచిపెట్టారని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై వారిని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన నిలదీశారు. ఈ కేసులో నిజాలు బయటకు రావాలని కోరుకుంటున్నానని అవినాష్ రెడ్డి అన్నారు. 

కాగా.. వివేకా కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందులకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్