
అమరావతి: ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు ఆయన చెప్పారు. కోర్టు అవకాశం ఇస్తే తాను లక్షల కోట్ల రూపాయల విరాళాలు సేకరించి స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతానని వివరించారు. అంతేకాదు, 10 లక్షల ఉద్యోగాలను ఇప్పిస్తానని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకు తాను దీక్ష కొనసాగిస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు.
ఏపీలో స్టీల్ ప్లాంట్ చుట్టూ రాజకీయాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ సారి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీరియస్ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలను గంభీరం చేస్తూ ఆయన విశాఖలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు చేయడానికి అడుగులు వేస్తున్నదని అన్నారు. లాభాలను తెచ్చిపెట్టే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అధోగతి పట్టించి దాన్ని కారుచౌకగా అదానీకి కట్టబెట్టే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.
Also Read: విపక్షాల ముంబయి సమావేశానికి సోనియా గాంధీ.. భేటీలో అజెండా ఖరారు
రూ. 8 లక్షల కోట్ల విలువైన ఈ పరిశ్రమను కేవలం రూ. 4 వేల కోట్లకే తన మిత్రుడు అదానీకి అప్పగించే ప్రయత్నాలను ప్రధాని మోడీ ప్రారంభించారని అన్నారు. అయితే.. ప్రధాని మోడీ చేస్తున్న ఈ ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సఫలం కానివ్వబోమని స్పష్టం చేశారు.