జెసి: చంద్రబాబును పొగిడారా? విమర్శించారా?

First Published Jun 9, 2017, 5:00 PM IST
Highlights

వ్యవసాయానికి చంద్రబాబు బాగా ప్రధాన్యత ఇస్తున్నారంటూనే దళారుల వల్ల ఏ పంటకూ గిట్టుబాటు ధరలు రావటం లేదని చురకలంటించారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు చాలా కష్టపడుతున్నాడని అంటూనే దేవుడు కూడా సిఎంకు సహకరించటం లేదని చెప్పారు.

చంద్రబాబునాయుడును అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి పొగిడారో లేక విమర్శించారో కూడా తెలీకుండా మాట్లాడారు. ఏరువాక కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఈరోజు రాయదుర్గంకు వచ్చారు. ఆ సందర్భంగా జెసి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చంద్రబాబు బాగా కష్టపడుతున్నారని అన్నారు. అలా అంటూనే చంద్రబాబు అనుకుంటున్నట్లు 2019లోపు పూర్తి కాదన్నారు.  

వ్యవసాయానికి చంద్రబాబు బాగా ప్రధాన్యత ఇస్తున్నారంటూనే దళారుల వల్ల ఏ పంటకూ గిట్టుబాటు ధరలు రావటం లేదని చురకలంటించారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు చాలా కష్టపడుతున్నాడని అంటూనే దేవుడు కూడా సిఎంకు సహకరించటం లేదని చెప్పారు.

తమకు అమరావతితో సంబంధం లేదని పోలవరం పూర్తి చేస్తే చాలున్నారు. ఒకవైపు పోలవరం పూర్తి కాదంటూనే వెంటనే పూర్తి చేయమని అడగటంతో అక్కడున్న వాళ్ళకు అసలు జెసి ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాలేదు.

వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబే సిఎం అవ్వాలని లేకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని ఆందోళన పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గనుక సిఎం అయితే మేం చచ్చిపోతామనటంతో అక్కడున్న వారందరూ విస్తుపోయారు. వెంటనే మనిషన్నాక ప్రతి ఒక్కరిలోనూ లోటుపాట్లుంటయాన్నారు. అంటూనే ప్రతీ ఒక్కరూ తప్పులు చేస్తారని చెప్పటం గమనార్హం.

అయితే, చంద్రబాబులో కూడా తప్పులున్నాయా, ఉంటే అవేంటని మాత్రం చెప్పలేదు. సిఎం కార్యదీక్ష, పట్టుదల చూసైనా జనాలు మళ్ళీ టిడిపికే ఓట్లు వేయాలన్నారు. చేతిలో పైసా లేకపోయినా ఎక్కడా అభివృద్ధి ఆగటం లేదన్నారు. జెసి మాటలను విన్న వారికి చంద్రబాబును జెసి విమర్శించారా లేక పొగిడారో కూడా సరిగా అర్ధం కాలేదు.

click me!