అసెంబ్లీ ఏమన్నా సాలార్జంగ్ మ్యూజియమా ?

First Published Jun 9, 2017, 1:47 PM IST
Highlights

నాసిరకం నిర్మాణాలను సమర్ధంచుకునేందుకు ప్రభుత్వమే జగన్ ఛాంబర్ పైన పైపున కోసేసి కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చి ఉండవచ్చు కదా అని నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. సరే జరిగిందేమిటన్నది భగవంతునికే తెలియాలి. అంతా అయిపోయిన తర్వాత తీరిగ్గా అసెంబ్లీని పరిశీలించేందుకు ప్రజలను, ప్రజాప్రతినిధులను అనుమతిస్తామని స్పీకర్ చెప్పటమెందుకో?

ఏపి అసెంబ్లీ పరిశీలనకు ఈ రోజు, రేపు సామాన్య ప్రజానీకంతో పాటు ప్రజాప్రతినిధులు, మీడియా అందరికీ అవకాశం కల్పిస్తున్నాం’. ఇది స్పీకర్ కోడెల శివప్రసాద్ చెప్పిన మాట. సమస్య వచ్చినపుడు లోపలకు వెళతామంటూ అడిగిన మీడియాను రెండు రోజుల పాటు అసెంబ్లీకి దూరంగా ఉంచారు.

ఏం జరిగిందో తెలుసుకునేందుకు తమతో పాటు మీడియాను కూడా అనుమతించాలని వైసీపీ ఎంఎల్ఏలు డిమాండ్ చేసినా స్పీకర్ పట్టించుకోలేదు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇపుడు తీరిగ్గా అందరినీ అనుమతిస్తామని స్పీకర్ చెప్పటంలో అర్ధమేంటి? అసెంబ్లీ ఏమన్నా సాలార్జంగ్ మ్యూజియమా అందరూ వెళ్ళి చూడటానికి?

20 నిముషాల వర్షానికే అసెంబ్లీలోని పలు ఛాంబర్లలోకి నీరు కారటం వాస్తవం. అందులో భాగంగానే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఛాంబర్లోకి కూడా నీరు కారింది. ఛాంబర్ మొత్తం నీటి మడుగును తలపించింది. నాసిరకం నిర్మాణాలు కావటం వల్లే సమస్య తలెత్తిందని వైసీపీతో సహా ప్రతిపక్షాలన్నీ ఎప్పటి నుండో ఆరోపిస్తున్నాయ్.

అయితే, వర్షపు నీరు జగన్ ఛాంబర్లోకి కారటం వెనుక నిర్మాణంలో లోపమేదీ లేదని ప్రభుత్వం ఇపుడు  తీరిగ్గా చెబుతోంది. జగన్ ఛాంబర్ పైన పైపు కట్ చేయటం వల్లే నీరు లోపలకి కారిందంటూ స్పీకర్ చెప్పారు. పైపు కట్ చేసిన అంశంపైనే సిఐడి విచారణకు కూడా ఆదేశించారు.

అయితే, వర్షం వల్ల అసెంబ్లీ భవనంలోకి నీరు కురుస్తోందని మీడియా బయటపెట్టినపుడే మీడియాను అనుమతించి ఉండవచ్చు. ఎందుకు అనుమతించలేదన్నదే పెద్ద ప్రశ్న.

వర్షం పడుతున్నపుడే భవనాన్ని పరిశీలించిన సిఆర్డీఏ కమషనర్ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ, కిటికీ తలుపులు తెరిచి ఉంచటం, ఛాంబర్ పైన పనులు చేసిన ఎలక్ట్రికల్ విభాగం వాళ్ళు పైపును కిందకి దింపటం వల్లే ఛాంబర్లోకి నీరు వచ్చిందని స్పష్టంగా చెప్పారు. ఎవరో పైపు కోసేయటం వల్లే నీరంతా ఛాంబర్లోకి కారిందని మరోసటి రోజు మధ్యాహ్నం స్పీకర్ చెప్పటంపైనే అందరికీ అనుమానాలు మొదలయ్యాయి.

నాసిరకం నిర్మాణాలను సమర్ధంచుకునేందుకు ప్రభుత్వమే జగన్ ఛాంబర్ పైన పైపున కోసేసి కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చి ఉండవచ్చు కదా అని నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. సరే జరిగిందేమిటన్నది భగవంతునికే తెలియాలి. అంతా అయిపోయిన తర్వాత తీరిగ్గా అసెంబ్లీని పరిశీలించేందుకు ప్రజలను, ప్రజాప్రతినిధులను అనుమతిస్తామని స్పీకర్ చెప్పటమెందుకో?

click me!