Today's Top Stories: 96 కోట్లమంది అర్హులే..! త్వరలో కేసీఆర్ రీఎంట్రీ.. టీడీపీ-జనసేన పొత్తుపై దుమారం..

By Rajesh KarampooriFirst Published Jan 27, 2024, 6:54 AM IST
Highlights

Today's Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో ఎన్నికల భారతం.. 96 కోట్లమంది ఓటు వేయడానికి అర్హులే..!, త్వరలో కేసీఆర్ రీఎంట్రీ.. టీడీపీ-జనసేన పొత్తుపై దుమారం, బీజేపీ కూటమిలోకి నితీశ్,  షర్మిలకు అండగా.. ఏపీ ఎన్నికల్లో టీ కాంగ్రెస్ ప్రచారం, గవర్నర్ పై హరీశ్ రావు ఫైర్.., ఆల్‌రౌండర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో రెచ్చిపోయిన జ‌డ్డూ !, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. టీ20 కాంట్రాక్ట్ నుంచి షోయబ్ మాలిక్ ఔట్ ..? వంటి వార్తల సమాహారం. 

Today's Top Stories: 96 కోట్లమంది అర్హులే..!

Lok Sabha Election 2024: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 47 కోట్ల మంది మహిళలతో సహా 96 కోట్ల మంది ప్రజలు ఓటు వేయడానికి అర్హులని భారత ఎన్నికల సంఘం తెలిపింది. భారతదేశం అంతటా 12 లక్షలకు పైగా పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం 1.73 కోట్ల మంది ఓటు హక్కు కలిగిన వారు 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులే. 18వ లోక్‌సభ సభ్యులను ఎన్నుకునేందుకు పార్లమెంటు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 1.5 కోట్ల మంది పోలింగ్ సిబ్బందిని నియమించనున్నారు. 

Latest Videos

ఏపీ ఎన్నికల్లో టీ కాంగ్రెస్ ప్రచారం 

Telangana Congress: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం వచ్చింది. పదేళ్ల తరువాత అధికారంలోకి రావడంతో పార్టీ శ్రేణుల్లో నయా జోష్ వచ్చింది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొత్త ప్లాన్ వేసింది. తదుపరి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ప్రచారం చేయించాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఈ ప్లాన్ ప్రకారం తెలంగాణ కాంగ్రెస్‌లోని మంత్రులు, సీనియర్ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి . ఆంధ్రప్రదేశ్‌ లో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో  బ్యాచ్‌ల వారీగా తెలంగాణ సీనియర్ మంత్రులు, అనుభవజ్ఞులైన నాయకులతో ప్రచారం చేయించాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నది. ఫిబ్రవరి 15 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌ రావొచ్చన్న నేపథ్యంలో ఆ పార్టీ ముందస్తు ప్రచారానికి దిగేందుకు సిద్ధమైంది.   

Janasena: టీడీపీ-జనసేన పొత్తుపై దుమారం

టీడీపీ, జనసేన పొత్తుపై తీవ్ర చర్చను లేవదీశాయి. టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదని, వాళ్లు రెండు సీట్లు ప్రకటిస్తే.. తానూ రెండు సీట్లు ప్రకటిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. అలాగే, సీఎం సీటుపైనా  పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారాన్ని రేపాయి. సీఎం సీటుపై ఉభయ పార్టీలు ఆశలు పెట్టుకున్న తరుణంలో సీట్ల పంపకం ఎలా జరుగుతుంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? అనే విషయాన్ని ప్రతిపక్ష శిబిరంతోపాటు అధికార పక్షం కూడా గమనిస్తున్నది. ఈ సందర్భంలోనే ఉభయ పార్టీల మధ్య డిఫరెన్స్‌లు ఉన్నాయని పవన్ కామెంట్‌తో బయటపడింది. 

త్వరలో కేసీఆర్ రీఎంట్రీ


BRS Party: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ప్రజల్లోకి రానున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల ఆశలన్నీ బీఆర్ఎస్ ఎంపీలపైనే ఉన్నదని చెప్పారు. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు బలంగా తమ గళం వినిపించాలని సూచించారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌజ్‌లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ నెలాఖరు నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. వచ్చే నెల 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సందర్బంలోనే కేసీఆర్.. బీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలతోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా హాజరయ్యారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు..!


Palla Rajeshwar Reddy: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ కి చెందిన  జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డితో పాటు ఆయన భార్య నీలిమ రెడ్డిపై రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ పీఎస్ లో ఎఫ్ఐఆర్   నమోదు అయింది. తప్పుడు పత్రాలతో భూ ఆక్రమణలకు యత్నించారని, ప్రశ్నించినందుకు బెదిరించారని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పల్లాతో పాటు ఆయన భార్య నీలిమ, మరో వ్యక్తి మధుకర్రెడ్డిపై కేసు నమోదైంది. ఈ మేరకు పీర్జాదిగూడకు చెందిన రాధిక ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పల్లా దంపతులపై కేసు నమోదు చేశారు.


ఖైదీలకు విముక్తి   

Republic Day: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జైలులో  సుధీర్ఘకాలం శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జైలులో నుంచి సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్లలో సత్ప్రవర్తన ప్రదర్శించిన 212 మంది జీవిత ఖైదీలు, 19 మంది జీవితేతర ఖైదీలతో కూడిన 231 మంది ఖైదీలను ముందస్తుగా విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం జనవరి 26 శుక్రవారం ప్రకటించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 ద్వారా గవర్నర్‌కు ఇచ్చిన అధికారాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకోబడింది. 

గవర్నర్ పై హరీశ్ రావు ఫైర్..
 
Harish Rao: కాంగ్రెస్ సిఫారసు చేసిన పేర్లకు గవర్నర్ తమిళిసై ఎమ్మెల్సీలుగా ఆమోదించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఈ నిర్ణయం కాంగ్రెస్, బీజేపీల రహస్య స్నేహాన్ని మరోసారి బట్టబయలు చేసిందని ఆరోపణలు చేశారు. తాము సిఫారసు చేసిన వారిని ఏ కారణం చేత తిరస్కరించారో.. అదే కారణం ఉన్నా కాంగ్రెస్ సిఫారసు చేసిన వారిని ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోదించిందని ఫైర్ అయ్యారు.

జ్ఞానవాపి సర్వే నివేదిక.. విరిగిన దేవతా విగ్రహాల ఫోటోలు వెలుగులోకి.. 

Gyanvapi Mosque Case: వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదుకు సంబంధించిన ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వే నివేదిక దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. మసీదు సముదాయంలోని హిందూ దేవతల విగ్రహాలు , ఇతర ఐకానోగ్రఫీ శకలాలు కనిపించేలా వెలుగులోకి వచ్చిన ఫోటోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవ్వడం కావడమే కాదు,  వివాదానికి దారితీశాయి. హనుమాన్, గణేశుడు, నంది వంటి హిందూ దేవతల విరిగిన విగ్రహాలను చూపించేలా జాతీయ వార్తాసంస్థ " INDIA TODAY " ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ ఫోటోలలో అనేక యోనిపట్టాలు (శివలింగం ఆధారంగా నిలబడే చోటు) , అలాగే ఏలాంటి ఆధారం లేదని శివలింగాలను చూడవచ్చు. 

బీజేపీ కూటమిలోకి నితీశ్.. 28న సీఎంగా ప్రమాణం.

Nitish Kumar: బిహార్‌లో రాజకీయం ఒక్కసారి రసవత్తరంగా మారింది. ఇండియా కూటమి కోసం మొదటి నుంచి ప్రయత్నాలు చేసిన నితీశ్ కుమార్ ఇప్పుడు ఆ కూటమిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కూటమి బాధ్యతల్లో కీలక పదవి దక్కకపోవడం, సీట్ల పంపకాల్లోనూ కాంగ్రెస్ జాప్యంతో ఆయన తిరిగి బీజేపీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నట్టు కొన్ని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 28వ తేదీన నితీశ్ కుమార్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నాడు. ఓ కార్యక్రమంలో ప్రసంగించాల్సిన పనిని కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. దీంతో ఆదివారం ఆయన బీజేపీ-జేడీయూ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయవచ్చని చెబుతున్నారు. ఆయనకు బీజేపీకి చెందిన ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారనీ చర్చ జరుగుతున్నది.

షోయబ్ మాలిక్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ! 
 
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ఇటీవలికాలంలో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో విడాకులతో పాటు మూడో పెళ్లి వ్యవహారాలతో ఆయన పేరు మారుమోగుతోంది. తాజాగా మరోసారి మాలిక్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో ఫార్చూన్ బరిషల్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సమయంలో మాలిక్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు లీగ్ మధ్యలో తప్పుకుని దుబాయ్‌కు వెళ్లిపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. దీంతో షోయబ్ మాలిక్ కాంట్రాక్ట్ రద్దు చేసే యోచనలో ఫార్చూన్ బరిషల్ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆల్‌రౌండర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో రెచ్చిపోయిన జ‌డ్డూ !

India vs England:టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా మ‌రోసారి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ ఆల్ రౌండ‌ర్ న‌ని నిరూపించాడు.  భార‌త్-ఇంగ్లాండ్ మ‌ధ్య జ‌రుగుతున్న ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రుగుతోంది. ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రుగుతున్న మొద‌టి టెస్టు తొలి ఇన్నింగ్స్ ర‌వీంద్ర‌ జ‌డేజా టాప్ క్లాస్ షోతో అద‌ర‌గొట్టాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఇంగ్లాండ్ టీమ్ ను దెబ్బ‌కొట్టాడు. బౌలింగ్ లో మూడు వికెట్లు తీసుకోవ‌డంతో పాటు 18 ఓవ‌ర్ల‌లో 4 మేడిన్ ఓవ‌ర్లు వేశాడు. కీల‌క‌మైన ఒల్లీ పోప్, జోరూట్, టామ్ హార్ట్లీ వికెట్ల‌ను తీసుకున్నాడు.

click me!