
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏపీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ జగన్ లెక్కలు అర్ధం కావడం లేదు. ఎవరికి టికెట్ వుంటుందో, ఎవరికి నో చెబుతారోనని నేతల్లో టెన్షన్ పట్టుకుంది. కొత్త ముఖాలను తెరపైకి తీసుకొచ్చి వారిని బరిలోకి దించుతున్నారు. తాజాగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సీఎం జగన్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నరసరావుపుట లోక్‌సభ బరిలో అనిల్ కుమార్‌ను దించాలని జగన్ యోచిస్తున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇక్కడి సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా నేపథ్యంలో జగన్ ఈ ఎత్తుగడ వేసినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పోటీకి సుముఖంగా వున్నది , లేదని ఆలోచించి అభిప్రాయం చెప్పాల్సిందిగా అనిల్ కుమార్‌ను జగన్ కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. అనిల్ ఓకే అంటే సరి, లేనిపక్షంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎంపీ పేరును జగన్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత చిలకలూరిపేట ఎమ్మెల్యే, మంత్రి విడదల రజినీ పేరును కూడా జగన్ పరిశీలిస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె కంటే కూడా అనిల్ అయితేనే ఇక్కడ బెటర్ అని జగన్ వద్ద సమాచారం వుందని టాక్.
నరసరావుపేట పార్లమెంట్ స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలు సైతం ఇక్కడి నుంచి బలమైన వ్యక్తిని పోటీ చేయించాలని జగన్‌ను కోరినట్లుగా తెలుస్తోంది. అందుకే వైసీపీ అధినేత అనిల్ కుమార్‌కు కబురుపెట్టారు. అనిల్ కుమార్ పేరును ప్రస్తావించగా, వారంతా మరో మాట లేకుండా ఓకే అనడంతో జగన్ కూడా ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయులు బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు, ఇప్పుడు ఆయన వెళ్లిపోవడంతో ఇదే స్థాయి వ్యక్తిని నరసరావుపేటకు తీసుకురావాల్సిన అవసరం వుంది.
బీసీ నేతగా, మంచి వాగ్ధాటి కలిగిన నాయకుడిగా వైసీపీలో అనిల్ కుమార్ యాదవ్‌కు పేరుంది. సామాజిక , ఆర్ధిక అంశాలను లెక్కలో వేసుకుని జగన్ ఆయన అభ్యర్ధిత్వానికి ఓటు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో తేల్చుకోవాల్సింది డాక్టర్ గారే. నెల్లూరు సిటీ నుంచి మరోసారి అసెంబ్లీకి పోటీ చేస్తానన్నా జగన్ కాదనే అవకాశం లేదు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, జగన్ ఇమేజ్ తనకు విజయాన్ని కట్టబెడతాయని అనిల్ గట్టి నమ్మకంతో వున్నారు. నెల్లూరు సిటీయే కాదు, నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసినా తనకు గెలుపు గ్యారంటీ అని ఆయన భావిస్తున్నారు. త్వరలోనే తన మనసులోని మాటను అధినేత చెవిన వేసే అవకాశం వుంది. చూద్దాం మరి ఏం జరుగుతోందో.